రూ.75 కోట్ల అగ్రి గోల్డ్‌ భూమి.. రూ.5.67 కోట్లకే టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి పరం | AgriGold victims faced injustice under the Chandrababu government | Sakshi
Sakshi News home page

రూ.75 కోట్ల అగ్రి గోల్డ్‌ భూమి.. రూ.5.67 కోట్లకే టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి పరం

Oct 31 2026 5:46 AM | Updated on Oct 31 2026 5:46 AM

AgriGold victims faced injustice under the Chandrababu government

కడప నగరానికి సమీపంలో 10.28 ఎకరాలను ఫిబ్రవరిలో వేలం వేసిన కరూర్‌ వైశ్యా బ్యాంక్‌  

కేవలం రూ.5.67 కోట్లకే సొంతం చేసుకున్న కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుమారుడు 

ప్రభుత్వ ధర ప్రకారమే ఆ భూమి విలువ రూ.8.95 కోట్లు 

బహిరంగ మార్కెట్‌ ధర రూ.75 కోట్లకు పైమాటే 

సాక్షి, అమరావతి: ఆగ్రిగోల్డ్‌ బాధితులకు గత చంద్రబాబు ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగిందో.. ఇప్పుడూ అదే జరుగుతోంది. అగ్రిగోల్డ్‌ భూములను విక్రయించి, బాధితులకు న్యాయం చేయాలని కోర్టు ఆదేశాలిస్తే.. ఆ పేరుతో విలువైన భూములను టీడీపీ నేతలు అతి చవగ్గా కొట్టేస్తున్నారు. భూముల అమ్మకం ద్వారా డిపాజిటర్లకు వారి డబ్బు చెల్లించి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం.. సొంత పార్టీ నేతలకు సహకరించి, భూములను దోచిపెడుతోంది. ఇందుకు తాజా ఉదాహరణే కడప నగరానికి సమీపంలోని అగ్రిగోల్డ్‌ భూముల అమ్మకం. బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ. 75 కోట్లు విలువ చేసే 10.28 ఎకరాల వ్యవసాయేతర భూమి­ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కుమారుడు కేవలం రూ. 5.67 కోట్లకే చేజిక్కించుకోవడంపై అగ్రిగోల్డ్‌ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాగైతే తమకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప నగరానికి సమీపంలో చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురం సర్వే నంబరు 36/1లో 9.92 ఎకరాలు, 36/2లో 0.36 ఎకరాలు కలిపి మొత్తం 10.28 ఎకరాల వ్యవసాయేతర భూమి విలువ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే రూ.8,95,59,360. కడప రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న ఆ భూమి ధర బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.7 కోట్లకుపైగా ఉంది.

అంటే.. ఆ భూమి ధర రూ.75 కోట్లపైమాటే. కానీ.. కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (జూబ్లిహిల్స్‌ బ్రాంచ్‌) ఫిబ్రవరిలో నిర్వహించిన వేలంలో ఆ భూమిని కేవలం రూ.5.67 కోట్లకే కడప టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసులురెడ్డిల కుమారుడు ఆర్‌.శ్రవణ్‌రాజ్‌ రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ఆర్కే ఇన్‌ఫ్రా సంస్థ దక్కించుకుంది. ఈ భూమిని జూలై 16న రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నారు. 

బాధితుల నోట్లో మట్టి 
అగ్రిగోల్డ్‌ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి సేకరించిన సొమ్ముతో పలు చోట్ల వివిధ సంస్థల పేరుతో భూములు కొన్నది. అదే విధంగా ఈ భూమిని అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ అవ్వా సీతారామారావు డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టల్‌ విజన్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కొన్నారు. అనంతరం కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ జూబ్లిహిల్స్‌ బ్రాంచ్‌లో తనఖా పెట్టి అవ్వా సీతారామారావు రుణం తీసుకున్నారు. ఆ రుణాన్ని చెల్లించలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్‌ ఆస్తులను ప్రభుత్వం 2015–16లో జప్తు చేసిన ఆస్తుల్లో ఈ భూమి కూడా ఉంది. 

ఆ భూములను వేలం వేయగా వచ్చే మొత్తం నుంచి బ్యాంకుకు రావాల్సిన సొమ్మును మినహాయించుకుని, మిగతా మొత్తాన్ని బాధితులకు చెల్లించడానికి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. కానీ, వచ్చింది బ్యాంకు రుణానికే సరిపోతుందని, తమకు ఒక్క రూపాయి కూడా రాదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014–19 మధ్యలో చేసిన తరహాలోనే ఇప్పుడూ తమ నోట్లో మట్టి కొట్టి టీడీపీ నేతలు అగ్రిగోల్డ్‌ భూములను అత్తెసరు ధరలకే కాజేస్తున్నారని మండిపడుతున్నారు. కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులురెడ్డి ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చి కేవలం రూ.5.67 కోట్లకే భూమిని కాజేసి.. తమ నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అప్పుడూ ఇప్పుడూ అగ్రిగోల్డ్‌ ఆస్తులపై టీడీపీ నేతల కన్ను
అగ్రిగోల్డ్‌ సంస్థ 8 రాష్ట్రాల్లో 19,18,865 మంది నుంచి రూ.6,380 కోట్లను డిపాజిట్లుగా సేకరించింది. వాటిని చెల్లించలేక 2015లో చేతులెత్తేసింది. ఒక్క మన రాష్ట్రంలోనే 11 .57  లక్షల మంది బాధితులు ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్‌ ఆస్తులను ప్రభుత్వం 2015–16లో జప్తు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు చెల్లించాలి. కానీ.. చంద్రబాబు సర్కార్‌ అప్పట్లో  తద్భిన్నంగా వ్యవహరించింది. అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో కుమ్మక్కై పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు ఆ సంస్థ భూములను కాజేశారు. 

ఈ వ్యవహారంపై అప్పట్లో బాధితులు తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేశారు. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ. 20 వేలు లోపు డిపాజిట్‌ చేసిన వారిలో 10.37 లక్షల మందికి రూ.930 కోట్లు చెల్లించి న్యాయం చేసింది. 2024లో చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చాక బాధితులకు ఒక్క పైసా కూడా చెల్లించిన దాఖలాలు లేకపోగా, అగ్రిగోల్డ్‌ ఆస్తులను మాత్రం అత్తెసరు ధరలకే టీడీపీ నేతలు కాజేస్తుండటం గమనార్హం.  2017 నుంచే ఆ భూమిపై పన్ను ఈ భూమిపై 2017 నుంచే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి భర్త శ్రీనివాసులురెడ్డి కన్ను వేశారని అగ్రిగోల్డ్‌ బాధితులు చెబుతున్నారు. 

తమ అప్పు తీర్చడానికి ఆ భూమిని రూ.5.67 కోట్లకు అమ్మేయడానికి అవ్వా సీతారామారావు అనుమతి ఇస్తూ 2016 డిసెంబర్‌ 6న  ఒప్పందపత్రం రాసిచ్చారని బ్యాంకు పేర్కొంది. ఆ బ్యాంకు విజ్ఞప్తి మేరకు ఆ భూమిని జప్తు చేసిన జాబితా నుంచి తొలగిస్తూ 2017 జనవరి 31న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి పాత్ర ఉన్నట్లు  డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా భూమిని కొట్టేశారని, దీనివెనుక ఏం జరిగిందన్నది బహిరంగ రహస్యమేనని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement