
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రాథమిక విచారణ అనంతరమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ దంపతుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులోను, సమాచారం అందుకుని దాడులు చేసిన కేసులోను ప్రాథమిక విచారణ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇది లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసు కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ 2016లో ప్రస్తుత ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఐఆర్‌ఎస్ అధికారి టి.విజయలక్ష్మి దంపతుల నివాసంలో సీబీఐ సోదాలు చేసింది.
ఈ సమయంలో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో.. దాన్ని సవాల్‌చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. మంత్రి ఆదిమూలపు సురేశ్, విజయలక్ష్మిలపై సీబీఐ ట్రాప్‌కేసు నమోదు చేయలేదని, ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసు అని సిద్ధార్థ లూత్రా కోర్టుకు వివరించారు. గతంలో సీబీఐ నమోదు చేసిన పలు కేసులను ప్రస్తావించారు. కేసులో సరైన ఆధారాలు లేనందువల్లే తెలంగాణ హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసిందని తెలిపారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా, ప్రాథమిక విచారణ జరపకుండా రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసిందన్నారు. అంతకుముందు సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలను సేకరించామని తెలిపారు. మంత్రి సురేశ్, విజయలక్ష్మిలతోపాటు మరో 11 మంది అధికారులపైనా కేసు నమోదు చేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికాని కారణంగా ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.