నిర్మా పౌడర్‌.. రంపపు పొట్టు.. కాదేదీ టీ పొడి తయారీకి అనర్హం

Adulterate Tea Powder Business Mandapeta East Godavari District - Sakshi

జిల్లాలో లైసెన్స్‌డ్‌ తయారీ కేంద్రాలు 11  

అనధికార కేంద్రాలు మరెన్నో 

యథేచ్ఛగా కల్తీ టీ పొడి తయారీ, అమ్మకాలు  

ప్రజారోగ్యంతో చెలగాటం 

నిర్మా పౌడర్, జీడిపొట్టు, సుద్దమట్టి వినియోగం 

తూతూమంత్రంగా తనిఖీలు 

నిర్మా పౌడర్‌.. జీడి తొక్కల పొట్టు.. సుద్ద మట్టి.. రంపపు పొట్టు.. కాదేదీ టీ పొడి తయారీకి అనర్హం అన్నట్టుగా ఉంది టీ పొడి తయారీ కేంద్రాల్లో పరిస్థితి. తేయాకుతో తయారు చేయాల్సిన టీ పొడిని.. ప్రజల ఆరోగ్యానికి తూట్లు ‘పొడి’చేలా తయారు చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. లూజ్‌ టీ పొడి పేరుతో గలీజు వ్యాపారాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ ధరకు వస్తుందన్న ఉద్దేశంతో టీస్టాల్‌ నిర్వాహకులు, పేదలు వీటిని వినియోగిస్తూ తమ గొంతుల్లో గరళాన్ని నింపుకొంటున్నారు.  

సాక్షి, మండపేట: ఏ ఛాయ్‌ చటుక్కున తాగరా భాయ్‌.. ఈ ఛాయ్‌ చమక్కులే చూడరా భాయ్‌.. ఏ ఛాయ్‌ ఖరీదులో చీపురా భాయ్‌.., ఈ ఛాయ్‌ ఖుషీలనే చూపురా భాయ్‌.., ఏ ఛాయ్‌ గరీబుకు విందురా భాయ్‌.. అంటూ ఓ సినీ కవి ఛాయ్‌(టీ) గొప్పదనాన్ని ఎంతో బాగా వివరించారు. నిజమే.. ఎందుకంటే చాలా మందికి వేడివేడి టీ తాగనిదే పొద్దు గడవదు.. నిత్యజీవితంలో భాగమైన ఈ టీ అమ్మకాల ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. మరోవైపు టీకి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని లూజ్‌ టీపొడి మాటున కల్తీ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు కొందరు.  

                 కల్తీ టీ పొడి తయారీకి వినియోగిస్తున్న సుద్దమట్టి  

జిల్లాలో లైసెన్సుడ్‌ టీపొడి తయారీ కేంద్రాలు రాజమహేంద్రవరం, మండపేట తదితర చోట్ల కేవలం 11 మాత్రమే ఉన్నాయి. వీరు కేరళ, అస్సాం, కోల్‌కతా నుంచి లూజ్‌ టీ పొడి తీసుకువచ్చి వాటిని 50 గ్రాములు, 100 గ్రాములు, 250 గ్రాములు తదితర కేటగిరీలుగా ప్యాకింగ్‌ చేసి విక్రయాలు చేస్తుంటారు. అయితే ఏ విధమైన అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అనధికార కేంద్రాలు కూడా జిల్లాలోని రాజమహేంద్రవరం, మండపేట, అనపర్తి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ నకిలీ ముఠాలు స్థానిక అధికార యంత్రాంగానికి ముడుపులు ముట్టచెప్పుతుండడంతో వారు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలున్నాయి. 

చదవండి: (మార్కాపురం కోర్టుకు హీరో సుమంత్‌, సుప్రియ)

కల్తీకి అడ్డదారులెన్నో.. 
రాజమహేంద్రవరంలో రూ.40 నుంచి రూ.50లకు లభ్యమయ్యే నాసిరకం లూజ్‌ టీపొడి తీసుకువచ్చి వాటిలో రంగు, రుచి, వాసన కోసం డిటర్జెంట్‌ పౌడర్, జీడిపిక్కల పొట్టు, చింతపిక్కల పొడి, రంపం పొట్టు, సుద్ద మట్టి, కెమికల్స్‌ను కలుపుతూ కల్తీ టీ పొడి తయారు చేస్తున్నారు. బ్రాండెడ్‌ టీ పొడి కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉండగా ఈ లూజ్‌ టీ పొడి కేవలం రూ.150కు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే లభ్యమవుతుండటంతో టీ స్టాళ్లు, పేదవర్గాల వారు దీనినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో పట్టణాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు, సైకిళ్లు, మోటారు సైకిళ్లపై కల్తీ టీపొడి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.


                               అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కల్తీ టీ పొడి   

రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు జిల్లా నుంచి వ్యాపారులు లూజ్‌ టీ పొడి తయారు చేసి ఎగుమతులు చేస్తున్నారు. దీని నాణ్యతపై అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా ఉంది. ఇటీవల బిక్కవోలు మండలం ఆర్‌ఎస్‌ పేటలో ఫుడ్‌ సేఫ్టీ, పోలీసు అధికారులు నిర్వహించిన దాడుల్లో విస్మయం కలిగించే విషయాలు వెలుగుచూశాయి. ప్రజారోగ్యానికి చేటు చేసే కెమికల్స్, డిటర్జెంట్స్‌తో నాలుగేళ్లుగా కల్తీ టీపొడి తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించారు. పలు లైసెన్సుడ్‌ కేంద్రాల్లోనూ టీ పొడిలో రసాయనాలు కలిపి కల్తీ చేస్తున్నారు.  

చదవండి: (బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోనే ఎక్కువ!)

ఆరోగ్యానికి చేటు   
ప్రమాదకర కెమికల్స్‌ను కలపడం వలన కల్తీ టీపొడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్సర్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందంటున్నారు. కల్తీ టీ పొడికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

కల్తీని ఇలా గుర్తించవచ్చు  
టీ పొడి కల్తీ జరిగింది లేనిది సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. కొంత టీ పొడిని తీసుకుని గాజు గ్లాసులోని నీటిలో వేసినప్పుడు కల్తీ జరిగితే రంగు కిందికి చేరుతుందని, రంగు దిగలేదంటే కల్తీ జరగలేనట్టుగా గుర్తింవచ్చని సూచిస్తున్నారు. 

కేసుల నమోదు 
ఆహార పదార్థాల్లో కల్తీలను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. కల్తీ టీ పొడి తయారీపై ఏడాది కాలంలో జిల్లాలో నాలుగు కేసులు నమోదు చేశాం. ఎక్కడైనా ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నాం. కల్తీ ఉన్నట్టు నిర్ధారణ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.  – బి. శ్రీనివాస్, సహాయ నియంత్రణ అధికారి, కాకినాడ 

కల్తీని ఇలా గుర్తించవచ్చు  
టీ పొడి కల్తీ జరిగింది లేనిది సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. కొంత టీ పొడిని తీసుకుని గాజు గ్లాసులోని నీటిలో వేసినప్పుడు కల్తీ జరిగితే రంగు కిందికి చేరుతుందని, రంగు దిగలేదంటే కల్తీ జరగలేనట్టుగా గుర్తింవచ్చని సూచిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top