చోడవరం తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి బాగోతం

ACB Arrests MRO And Deputy Tahsildar Taking Bribe In Chodavaram - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని చోడవరం తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం బయటపడింది. భూమి మార్పిడి పేరిట నాలుగు లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ఏసీబికి అడ్డంగా దొరికొపోయారు.  వీరికి సహకరించిన డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు.. చోడవరం సమీపంలోని నరసాపురం వద్ద ఓ వ్యవసాయ భూమిని నివాసభూమి గా మార్చేందుకు ఓ వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆ పనులు చేయకుండా ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది జాప్యం చేశారు. ఈ దశలో దరఖాస్తుదారుడు ఎమ్మార్వో రవికుమార్‌తో పాటు డిప్యూటీ తాసిల్దారు రాజాను కలిసి భూముల రికార్డుల మార్పిడి చేయాలని కోరాడు. ఈ పని పూర్తి చేయాలంటే నాలుగున్నర లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని తాసిల్దారు డ్రైవర్ రమేష్ కు ఇవ్వాలని తెలిపారు.

దీంతో ఏసీబీని ఆశ్రయించిన సదరు వ్యక్తి వారి సూచనల మేరకు  డ్రైవర్ రమేష్‌కు నాలుగున్నర లక్షల రూపాయలను ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌లను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు వారి ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్ర పర్యవేక్షణలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top