ప్రొఫెసర్లుగా 80 మంది వైద్యులు

భారీగా పదోన్నతులు
త్వరలోనే నాన్‌క్లినికల్ విభాగాల్లో పనిచేసే వారికి ..
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వైద్యుల కల ఎట్టకేలకు ఫలించింది. ఒకే దఫాలో 80మందికి పైగా అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసే వైద్యులకు ప్రొఫెసర్లు కావడమనేది అత్యున్నత పోస్టు. దీనికోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తుంటారు. గత ప్రభుత్వాల హయాంలో అర్హత ఉన్నా.. సకాలంలో పదోన్నతులు ఇవ్వలేదు. తాజాగా క్లినికల్ విభాగంలో 80 మందికి పైగా వైద్యులు ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందారు. వీరికి నేడో రేపో జూమ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
వీరితో పాటు నాన్‌క్లినికల్ అంటే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్ ఇలా రకరకాల విభాగాల్లో పనిచేసే వారి పదోన్నతుల జాబితా రెడీ చేశారు. ఈ వారంలో వీళ్లకూ ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. నెల రోజుల క్రితమే ఏడుగురు ప్రొఫెసర్లకు అదనపు సంచాలకులుగా పదోన్నతులిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 2006 తర్వాత టీచింగ్ విభాగంలో పనిచేస్తున్న వైద్యులందరికీ 2020లోనే పీఆర్‌సీ వచ్చింది. 2016లోనే అప్పటి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వేతన సవరణ చేయడంతో ఎంతోమంది వైద్యులకు ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. ప్రధానంగా సర్వీసు 10 ఏళ్లు దాటిన వైద్యులకు రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం పెరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సైతం భారీగా వేతనాలు పెరిగాయి.