నిరుద్యోగులకు ఉత్త చెయ్యి సలహాదారులకు దోచేయ్‌! | 71 consultants in AP State Planning Society | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు ఉత్త చెయ్యి సలహాదారులకు దోచేయ్‌!

Jun 28 2025 4:08 AM | Updated on Jun 28 2025 4:08 AM

71 consultants in AP State Planning Society

యువతకు ఉద్యోగాలు, భృతి లేదుగానీ బాబు పరివారానికి ఉపాధి

ఈవీఎం ట్యాంపరింగ్‌ చేసిన వేమూరి సలహాదారుగా నియామకం

చెరుకూరి కుటుంబరావుకు స్వర్ణాంధ్ర పీ–4 వైస్‌ చైర్మన్‌ పదవి

ఫోరెన్సిక్‌ సలహాదారుగా కేపీసీ గాంధీ

స్వర్ణాంధ్ర విజన్‌ యూనిట్ల పేరుతో టీడీపీకి చెందిన 175 మందికి ఏడాదికి రూ.12.60 కోట్లు వేతనాలు

ఏపీ స్టేట్‌ ప్లానింగ్‌ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లు 

సీఆర్‌డీఏ కన్సల్టెంట్లకు ఇప్పటి వరకు రూ.100 కోట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి హామీని గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు సలహాదారులు, కన్సల్టెంట్ల పేరుతో తన పరివారానికి ఖజానా నుంచి ఎడాపెడా పంచిపెడుతున్నారు. చంద్ర­బాబుతోపాటు మంత్రి లోకేశ్‌ తమకు కావా­ల్సి­న వారిని నియమించుకుంటూ ప్రజల సొమ్ము­తో ఉపాధి కల్పిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీలకు డబ్బులు లేవంటూ చేతులె­త్తేసి సలహాదారులు, కన్సల్టెంట్లకు మాత్రం రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. రాజధాని పనులంటూ ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వెచ్చించి కన్సల్టెంట్ల నియామకం చేపట్టారు.

రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారు­లతో పాటు తమకు కావాల్సిన పలువురిని సలహాదారు­లుగా నియమించి ఖజానా నుంచి భారీ ఎత్తున వేతనాలను చెల్లిస్తున్నారు. పీ 4 పథకం అమ­లుకు సంబంధించి 175 అసెంబ్లీ నియోజవర్గ విజన్‌ యూనిట్లలో యువ నిపు­ణుల పేరుతో నెలకు రూ.60 వేలు చొప్పున ఏడాదికి రూ.12.60 కోట్ల వంతున నాలుగేళ్లలో ఏకంగా రూ.50.40 కోట్లు రాష్ట్ర డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ గ్రాండ్‌ ఇన్‌ ఎయిడ్‌ నుంచి చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

175 నియోజకవర్గ స్వరాంధ్ర యూనిట్లలో ఒక్కో చోట ఐదుగురు చొప్పున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించినప్పటికీ యువ నిపుణుల పేరుతో 175 మంది ప్రైవేట్‌ వ్యక్తులను అదనంగా నియమించడం అధికార దుర్విని­యోగం కిందకే వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక వికసిత్‌ ఆంధ్రా విజన్‌ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీలో 71 పోస్టుల్లో కన్సల్టెంట్లను నియమించి నెలకు రూ.లక్షల్లో వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు.  మరోపక్క రాష్ట్ర ఆదాయం పెంచేందుకంటూ 11 మంది కన్సల్టెంట్లను 8 నెలల కోసం రూ.3.28 కోట్లు చెల్లిస్తూ నియమించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డుకు (ఈడీబీ) కేపీఎంజీ నుంచి ఆరుగురు కన్సల్టెంట్లు సేవలందించేందుకు రూ.3,66,91,639 చెల్లిస్తున్నారు. 

సీఆర్‌డీఏలో ఇష్టారాజ్యంగా..
అమరావతిలో ప్రతి ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రత్యేకంగా మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీలను సీఆర్‌డీఏ నియమిస్తోంది. జోన్‌ 2,4,6,10లో చేపట్టిన పనుల పర్యవేక్షణ బాధ్యతను ఆర్వీ అసోసియేట్స్‌ ఆర్కిటెక్ట్స్‌ ఇంజనీర్స్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.49.95 కోట్లతో సీఆర్‌డీఏ అప్పగించింది. జోన్‌ 12, 12 ఏ మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు పర్యవేక్షణను నిప్పాన్‌ కోయి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.40.44 కోట్లతో అప్పగించారు. 

అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కన్సల్టెంట్‌ ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.11.44 కోట్లకు సీఆర్‌డీఏ అప్పగించింది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌ నిర్మాణ పనుల పర్యవేక్షణకు వివిధ రంగాలకు చెందిన కన్సల్టెంట్లను నియమిస్తోంది. ఇందుకోసం రెండేళ్లకు రూ.22.58 కోట్లు చెల్లించనున్నారు. జోన్‌ 7  పనులను పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీకి రూ.10.60 కోట్లు చెల్లించనున్నారు.

» ఈవీఎంల చౌర్యం, ట్యాంపరింగ్‌ కేసులో నిందితుడైన వేమూరి రవికుమార్‌ను ఏపీ ఎన్నార్టీఎస్‌ సలహాదారుగా నియమించారు. 
»    చెరుకూరి కుటుంబరావును స్వర్ణాంధ్ర పీ 4 వైస్‌ చైర్మన్‌గా నియమించారు. 
»   ఫోరెన్సిక్‌ సలహాదారుగా కేపీసీ గాంధీ నియామకం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement