దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఆయిల్‌పామ్ తోట (అంతరచిత్రం) పరిశ్రమకు రవాణా చేస్తున్న పామాయిల్ గెలలు
రైతులను ఆదుకొంటున్న పంట
తూర్పు గోదావరి జిల్లాలో 49 వేల ఎకరాల్లో సాగు
టన్ను గెలల ధర రూ.19,636
ఎకరాకు 12 టన్నుల దిగుబడి రూ.2 లక్షల రాబడి
దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న ఆయిల్‌పామ్ సాగు కొన్నాళ్లుగా ఆశాజనకంగా ఉంటోంది. మార్చి నెలతో పోలిస్తే ధర కొంత తగ్గింది. అయినప్పటికీ ఇప్పుడు లభిస్తున్న ధర గిట్టుబాటు అవుతోందని, ఇది ఇంకా పెరిగితే తమకు మరింత లాభదాయకంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో సుమారు 38 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోంది. దాదాపు 30 ఏళ్లుగా ఈ ప్రాంత రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు.
వారు పండించిన ఆయిల్‌పామ్ గెలలను 3ఎఫ్ ఆయిల్, నవభారత్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. టన్ను ఆయిల్‌పామ్ గెలలకు 2019లో రూ.6 వేలుగా ఉన్న ధర అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2022 నాటికి ఏకంగా 23,639కి పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో రూ.20,900 ధర లభించగా ప్రస్తుతం అది రూ.19,636కు తగ్గింది. పామాయిల్ రికవరీ శాతాన్ని బట్టి ఆయిల్‌పామ్ గెలల ధరను ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అక్టోబర్‌లో ఫ్యాక్టరీకి రైతులు ఇచ్చిన గెలలకు నవంబర్‌లో ధర ప్రకటిస్తుంది. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులకు అదనంగా టన్నుకు రూ.170 చెల్లిస్తారు. ప్రస్తుతం లభిస్తున్న ధర గిట్టుబాటు అవుతున్నప్పటికీ మరింత పెరిగితే బాగుంటుందని రైతులు ఆశిస్తున్నారు.
సాగుపై ఆసక్తి
ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్‌కు గిట్టుబాటు ధర లభిస్తూండటంతో రైతులు దీని సాగుకు ఆసక్తి చూపుతున్నారు. చాలామంది రైతులు తమకున్న భూమిలో కొంత విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలో పలువురు రైతులు 10 నుంచి 40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. కొంతమంది జీడిమామిడి తోటలను తొలగించి ఆ భూముల్లో ఆయిల్‌పామ్ మొక్క తోటలు వేస్తున్నారు. వీటి నుంచి ఐదేళ్ల తర్వాత దిగుబడి మొదలవుతుంది. సరైన యాజమాన్య పద్ధతులు, నీటి సదుపాయం ఉన్న భూముల్లో మొక్క తోటల నుంచి ఎకరాకు 10 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి సాధిస్తున్న రైతులు కూడా ఉన్నారు. ప్రస్తుతం పొగాకు సాగు కష్టతరంగా మారడం, కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా మరికొందరు ఆ భూముల్లో నాలుగేళ్లుగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఈ విధంగా దాదాపు 12 వేల ఎకరాల్లో మొక్క తోటలు వేసినట్లు సమాచారం.
దిగుబడి వచ్చే సమయంలో ధర స్వల్పం
ఆయిల్‌పామ్ గెలల దిగుబడి ఏడాదికి ఎకరాకు సగటున 10 నుంచి 12 టన్నుల వరకూ వస్తుంది. ఇందులో 80 శాతం దిగుబడి మే – ఆగస్టు నెలల మధ్యనే వస్తుంది. మిగిలిన ఎనిమిది నెలలూ 20 శాతం మాత్రమే దిగుబడి వస్తుంది. ఆ సమయంలోనే మార్కెట్లో ధర పెరుగుతుంది. వర్షాకాలం నాలుగు నెలలూ దండిగా దిగుబడి వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర రావడం లేదని, దీంతో, ఆదాయం తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. మొత్తం మీద ఏడాదికి ఎకరాకు సుమారు రూ.2 లక్షల ఆదాయం వస్తుందని, ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్‌కు మంచి ధర వస్తుందని అంటున్నారు.
ఆదుకుంటోంది
ఆయిల్‌పామ్ పంట రైతులను ఆదుకుంటోంది. ఇతర పంటల నష్టాన్ని భర్తీ చేస్తోంది. టన్ను గెలల సగటు ధర రూ.16,000 ఉంటే ఏడాదికి ఎకరాకు రూ.1.60 లక్షలు, రూ.20,000 పలికితే రూ.2 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. ఖర్చులు పోనూ ఎకరాకు సుమారు రూ.1.50 లక్షలు మిగులుతోంది. పెట్టుబడి ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు అవుతుంది. నేను 25 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నాను. 15 ఎకరాల మొక్క తోట ఉంది. ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తోంది. – మేడిబోయిన గంగరాజు, రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం.
ఇది లాభాల పంట
ఆయిల్‌పామ్ లాభాల పంట. శ్రమ, పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ ఇచ్చే పంట. డ్రిప్ ద్వారా నీటి తడులు పెట్టడం, పశువుల ఎరువు వాడడం వల్ల దిగుబడులు పెరిగాయి. ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తుంది. నేను 8 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నాను. ఎకరాకు సగటున 9 టన్నుల దిగుబడి వస్తోంది. మార్కెట్లో ధర మరింత పెరిగే అవకాశ«ం ఉంది. – చిరువూరి గంగాధర్, రైతు, దేవరపల్లి
వర్షాకాలంలోనే దిగుబడి
ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ పంట లాభదాయకంగా ఉంది. ఏడాదికి సగటున ఎకరాకు రూ.2.20 లక్షల ఆదాయం వస్తోంది. పెట్టుబడి, ఖర్చులు పోను ఎకరాకు రూ.1.80 లక్షలు నికరంగా మిగులుతోంది. ఆయిల్‌పామ్ తోటల్లో కోకో, అరటి వంటివి అంతర పంటలుగా సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. వర్షాకాలం నాలుగు నెలలూ నాణ్యమైన గెలల దిగుబడి వస్తుంది. కొంత మంది రైతులు ఎకరాకు 10 నుంచి 13 టన్నుల దిగుబడి కూడా సాధిస్తున్నారు.
– యాగంటి వెంకటేశ్వరరావు, రైతు, దేవరపల్లి


