
చికిత్స పొందుతున్న విద్యార్థులు
ముగ్గురు విద్యార్థినులకు అస్వస్థత
ఆసుపత్రిపాలైన వైనం
తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో ఘటన
నిన్న భోజనంలో బొద్దింక ఘటన మరువక ముందే మరో ఉదంతం
నాడు జగన్ పాలనలో బడి పిల్లలకు ‘గోరు ముద్ద’లతో పౌష్టికాహారం అందించారు. నేడు కూటమి పాలనలో ‘పురుగుల’ అన్నం పెడుతున్నారు. ఒకటో తారీకున పాయకారావుపేట బీసీ బాలికల గురుకుల కళాశాల వసతి గృహంలో బొద్దింక భోజనాన్ని సాక్షాత్తు హోం మంత్రి అనితే రుచి చూశారు. మూడో తేదీన ఇలాంటిదే మరో సంఘటన. తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినులకు పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. 64 మంది తినగా, ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖలో తీసుకొస్తానంటున్న విప్లవాత్మక మార్పులు ఇవేనా? అని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు.
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థులు తినే ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. ఈ రెండు ఘటనలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న భోజన వసతి ఏమేర ఉందో తేటతెల్లమవుతోంది. అసలేం జరిగిందంటే... తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో గురువారం ఉదయం ప్రార్థన జరుగుతుండగా ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారికి సపర్యలు చేసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉదయం తిన్న ఉప్మాలో జెర్రి వచ్చిందని విద్యార్థినులు వైద్యులకు తెలియజేశారు.
విద్యార్థుల కథనం మేరకు.. తెలుగుగంగ కాలనీలోని బీసీ కళాశాల వసతి గృహంలో 84 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురువారం ఉదయం 64 మంది విద్యార్థులకు ఉప్మాను అల్పాహారంగా అందించారు. యోష్ణ అనే విద్యార్థిని తనకు పెట్టిన ఉప్మాలో జెర్రి వచ్చిందని తోటి విద్యార్థులకు చూపించింది. దాంతో విద్యార్థులు ఎవరు ఉప్మా తినకుండా అక్కడ పడేసి కళాశాలకు బయలు దేరి వెళ్లిపోయారు.
అయితే ప్రార్థన సమయంలో ఎం బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న యోష్ణ కళ్లు తిరిగి కిందపడిపోయింది. కడుపు నొప్పితో వాంతులు అయ్యేలా ఉన్నాయని ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మునికుమారి, ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న జ్యోత్స్న అధ్యాపకులకు చెప్పారు. అధ్యాపకులు వెంటనే వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందించడంతో వారు కోలుకున్నారు.