సంక్రాంతికి 1,500 ఆర్టీసీ బస్సులు!

1500 RTC bus services for Sankranthi Festival - Sakshi

ఉభయగోదావరి జిల్లాలకు ఇప్పటికే రిజర్వేషన్లు ఫుల్‌

అత్యధిక సర్వీసులు హైదరాబాద్‌కు తిప్పేందుకు ప్రణాళిక

బీహెచ్‌ఈఎల్‌లో స్థలం కొనుగోలుతో పార్కింగ్‌కు తొలగిన ఇబ్బందులు

సాక్షి, అమరావతి: ఈ సంక్రాంతి పండక్కి ఆర్టీసీ 1,500 ప్రత్యేక సర్వీసులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. గత రెండేళ్ల నుంచి 2,200 సర్వీసుల వరకు తిప్పిన ఆర్టీసీ ఈ దఫా కరోనా కారణంగా బస్సులను తగ్గించనుంది. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి సర్వీసులను నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులతో ఎండీ కృష్ణబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా సంక్రాంతి పండక్కి ఎన్ని సర్వీసులు నడపాలనే అంశంపైనే చర్చ జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక బస్సులపై ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోనున్నారు. అత్యధిక సర్వీసులు హైదరాబాద్‌కు తిప్పేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు రిజర్వేషన్లు ఫుల్‌ అయ్యాయి. ఈ జిల్లాలకు వెళ్లేందుకు ప్రతి ఏటా డిమాండ్‌ అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉభయగోదావరి జిల్లాలకు ప్రత్యేక బస్సులు అధిక సంఖ్యలో నడపనున్నారు. పండగ తిరుగు ప్రయాణంలోనూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్సులు నడపనున్నారు.

హైదరాబాద్‌లో ఏర్పాట్లు ఇలా..
► హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ (ఎంజీబీఎస్‌)లో రద్దీ తగ్గించేందుకు, బస్సుల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.
► బీహెచ్‌ఈఎల్‌లో బస్సుల పార్కింగ్‌కు గతంలో ఆర్టీసీ స్థలం కొనుగోలు చేయడంతో ఇబ్బందుల్లేవని అధికారులు పేర్కొంటున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, పండుగ స్పెషల్‌ బస్సులన్నీ ఎంజీబీఎస్‌ వెలుపల ఉన్న గౌలిగూడ సీబీఎస్‌ హాంగర్‌ (సిటీ బస్‌ టెర్మినల్‌) నుంచి బయల్దేరేలా ఏర్పాట్లు చేయాలని ఆలోచన చేస్తున్నారు.
► విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే అన్ని పండుగ స్పెషల్‌ బస్సులు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి (ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్, కేపీహెచ్‌బీ, ఎల్‌బీ నగర్‌) నడపనున్నారు. ఈ ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్‌లోకి రాకుండా నేరుగా వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు.
► గతేడాది పండక్కి ఆర్టీసీ రూ.67 కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టింది. ప్రయాణికులపై భారం మోపకుండా 40% రాయితీతో ప్రత్యేక సర్వీసుల్ని ఆర్టీసీ నడిపింది. ఈ దఫా పండక్కి సొంతూళ్లకు వెళ్లే వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరులకూ ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top