సాక్షి,అనంతపురం: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం మరువక ముందే.. అనంతపురం జిల్లా మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పుట్లూరు మండలం చింతలకుంట సమీపంలో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి తీసుకెళ్లింది.
పుట్లూరు నుంచి పాఠశాల విద్యార్థులు,ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వెళుతోంది. అయితే ఆర్టీసీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో అతివేగంతో ఆర్టీసీ బస్సు పుట్లూరు వద్ద అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.

ప్రమాద సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికులు కిటికీ నుంచి కిందకి దూకేశారు. ఆర్టీసీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్రమత్తమైన స్థానికులు గాయపడిన విద్యార్థులతో పాటు ఇతర ప్రయాణికుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు మృతి
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) మరికొందరితో కలిసి కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గాణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లారు. దైవ దర్శనం ముగించుకుని వస్తుండగా తిరుగు ప్రయాణంలో వీరి కారు ప్రమాదానికి గురైంది. హల్లిఖేడ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న వ్యాను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు కన్నుమూశారు.దీంతో జగన్నాథ్‌పూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


