ఈ నెల 13 నుంచి 25 వరకు గడువు
రూ.500 ఆలస్య రుసుంతో వచ్చే నెల 15 వరకు అవకాశం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల (ఎస్‌ఎస్‌సీ–2026) ఫీజు చెల్లింపునకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. అన్ని పాఠశాలలు రెగ్యులర్, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థుల పరీక్ష ఫీజును ఈనెల 13 నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు చెల్లించవచ్చని పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 3 వరకు, రూ.200 ఫైన్‌తో 10వ తేదీ, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ తేదీలలో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలు ఉంటే తదుపరి పని దినాన్ని గడువు తేదీగా పరిగణిస్తారు. విద్యార్థుల ఫీజును https://bse. ap.gov.in లలో అందుబాటులో ఉన్న స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. మాన్యువల్ నామినల్ రోల్స్ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.
పరీక్ష ఫీజు రుసుం ఇలా..
⇒ రెగ్యులర్ విద్యార్థులు (అన్ని సబ్జెక్టులకు) రూ.125
⇒ మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125
⇒ మూడు సబ్జెక్టుల వరకు రూ.110
⇒ వృత్తి విద్యా కోర్సులకు అదనంగా రూ.60
⇒ వయసు మినహాయింపు కోసం రూ.300
మార్చిలో ‘పది’ పరీక్షలు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చిలో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి నెల రెండు లేదా మూడో వారం నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మార్చి 16, 21 తేదీలతో టైంటేబుల్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది.


