ప్రశాంతి నిలయం: సత్యసాయి జయంతి వేడుకలు సోమవారం పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో వైభవంగా జరిగాయి. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది భక్తులు సత్యసాయిని స్మరిస్తూ ఆధ్యాత్మిక పరవశం చెందారు.
స్వర్ణ రథోత్సవం..భక్తి,
ప్రేమల మహోత్సవం
శత జయంతి సందర్భంగా సత్యసాయిపై తమ భక్తి, ప్రేమను చాటుతూ స్వర్ణ రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సత్యసాయి స్వర్ణ రథోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థుల వేదఘోష, మంగళవాయిద్యాలతో రథం ముందుకు సాగింది. అనంతపురం క్యాంపస్ మహిళా విద్యార్థులు, ప్రైమరీ స్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్ బ్రాస్‌బ్యాండ్ వాయిద్యంతో సత్యసాయిపై విద్యార్థులు గీతాలు ఆలపిస్తూ ముందు నడవగా, ఆ వెనుక భక్తులు సత్యసాయిని స్మరిస్తూ రథాన్ని లాగుతూ ముందుకు సాగారు. హిల్‌వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన శాంతి వేదిక వరకు రథోత్సవం సాగింది.
సాయి సందేశాన్ని చాటిన
ప్రేమ ప్రవాహిని రథాలు
సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా సత్యసాయి చాటిన మానవతా విలువలను దేశ వ్యాప్తంగా వివరించేందుకు చేపట్టిన ప్రేమ ప్రవాహిని పవిత్ర యాత్ర సోమవారం ముగిసింది. సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలు, మానవతా విలువలను చాటుతూ 18 నెలలు పాటు 5 రథాలతో ప్రేమ ప్రవాహిని యాత్ర సాగింది. గత ఏడాది ఏప్రిల్ 25న ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన యాత్ర దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ 18 నెలల పాటు సాగింది.
సత్యసాయి యూనివర్సల్
టార్చ్ ఆవిష్కరణ
విశ్వశాంతిని కాంక్షిస్తూ సత్యసాయి సేవా సంస్థలు స్వామి జయంతి వేడుకల్లో యూనివర్సల్ టార్చ్‌ను అవిష్కరించాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్చ్‌ను వెలిగించి ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో టార్చ్ యాత్ర కొనసాగనుంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఎస్‌ఎస్ నాగానంద స్వాగతోపన్యాసం చేశారు. సత్యసాయి సందేశాన్ని, సంకల్పాన్ని వివరించారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, ముఖ్య అతిథులు సత్యసాయి జయంతి కేక్‌ను కట్ చేసి భక్తులకు పంపిణీ చేశారు. వేడుకల్లో సినీనటులు రాధిక, శరత్‌కుమార్ దంపతులు, సాయిపల్లవితో పాటు కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్యభరద్వాజ్, స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
సేవకు ప్రతిరూపం సత్యసాయిబాబా
సత్యసాయి జీవితం ప్రేమ, కరుణ, త్యాగం, సేవకు ప్రతిరూపమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. మానవతా విలువలతోనే సమసమాజ స్థాపన సాధ్యమన్నారు. ‘అందరినీ ప్రేమించు– అందరినీ సేవించు’ అన్న సత్యసాయి సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సత్యసాయి స్ఫూర్తితో ట్రస్ట్ అందిస్తున్న విద్య, వైద్యం, తాగునీటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. యువత మానవతా విలువలను పాటిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రులను గౌరవించడం, గురువులు, మహిళల పట్ల మంచి భావనతో మెలగాలని, అభాగ్యుల పట్ల సానుకూలంగా స్పందించే గుణాలను పెంపొందించుకోవాలన్నారు.
సత్యసాయి జయంతి ఉత్సవాలకు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేరళం సీఎం సతీషన్‌తో సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, సభ్యులు
పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో సత్యసాయి స్వర్ణ రథోత్సవం
‘బంగారూ’.. అంటూ ఆప్యాయంగా పిలిచే బాబాను తలచుకుని భక్తకోటి తన్మయత్వం చెందింది. సత్యసాయి శత వర్ష జయంత్యుత్సవాల సందర్భంగా భక్తితో ప్రణమిల్లింది. స్వామికి స్వర్ణరథోత్సవం నిర్వహించి సంబర పడింది. సేవా కార్యక్రమాలను శకటాల ద్వారా ప్రదర్శించింది. అతిరథ మహారథులు, దేశవిదేశాలకు చెందిన భక్తుల జయజయ ధ్వానాలతో పుట్టపర్తి పులకించింది.


