● అట్టహాసంగా మేయర్ ప్రమాణ స్వీకారం
అనంతపురం: అనంతపురం నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా సి.రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ హాలులో సోమవారం నిర్వహించిన ’ప్రత్యేక సమావేశం – 2026’లో నూతన మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. నగరపాలక సంస్థ ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తొలుత మేయర్ వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రిసైడింగ్ అధికారి ముందుగా నూతన మేయర్ రమేష్ గౌడ్, ఆ తర్వాత సమావేశానికి హాజరైన 62 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార ప్రక్రియ ముగిసిన అనంతరం మేయర్ సర్వమత ప్రార్థనలు నిర్వహించి, తన ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
డిప్యూటీ మేయర్‌గా టి.స్వాతి
తదుపరి ప్రక్రియలో భాగంగా ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ ఆనంద్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. డిప్యూటీ మేయర్ పదవికి 8వ డివిజన్ కార్పొరేటర్ టి.స్వాతి పేరును 56వ డివిజన్ కార్పొరేటర్ జి.లక్ష్మిరెడ్డి ప్రతిపాదించగా, 43వ డివిజన్ కార్పొరేటర్ రాజారావు బలపరిచారు. మరెవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో టి.స్వాతి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి, డిక్లరేషన్ ఫారం అందజేశారు. అనంతరం ఆమె డిప్యూటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశంలో ఎక్స్–అఫీషియో సభ్యులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ జశ్వంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీల్లో కొలువుదీరిన పాలకవర్గాలు
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. గుంతకల్లు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా యశోద గౌడ్, వైస్ చైర్మన్‌గా సాయి ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. గుత్తి మున్సిపల్ చైర్మన్‌గా గోవిందరాజులు తమిళ సెల్వి, వైస్ చైర్మన్‌గా అబ్దుల్, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్‌గా బుట్నా లక్ష్మి, వైస్ చైర్మన్‌గా వెంకట కార్తీక్, తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రేష్మా పర్వీన్, వైస్ చైర్మన్‌గా టంగటూరి స్వప్న, రాయదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా టంకశాల హనుమంతు, వైస్ చైర్మన్‌గా బాషా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కౌన్సిలర్ల చేత కూడా అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.


