● మాజీ మంత్రి శైలజానాథ్
బుక్కరాయ
సముద్రం: కూటమి గూండాల దాడులకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడబోరని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. సోమవారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు రోజురోజుకూ పెరిగి పోతున్నాయని మండిపడ్డారు. అయితే అధికార పార్టీ ఆగడాలకు పోలీసు యంత్రాంగం కూడా సహకరిస్తుండటం విచారకరమన్నారు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో ఇంటికి వెళ్తున్న మాజీ ఎంపీటీసీ నాగయ్యను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అడ్డగించి కట్టెలతో తీవ్రంగా కొట్టారన్నారు. చెన్నంపల్లిలో నాగయ్య కిందపడటం వల్ల దెబ్బ తగిలిందని కూటమి నాయకులు చెప్పడం సిగ్గు చేటన్నారు. ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కచ్చితమైన సమాచారం ఇవ్వాలి
అనంతపురం: విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా కచ్చితమైన సమాచారాన్ని అఖిల భారత ఉన్నత విద్య సర్వే పోర్టల్‌లో సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్‌పర్సన్, అఖిల భారత ఉన్నత విద్య రాష్ట్ర నోడల్ అధికారి ప్రొఫెసర్ కె.రత్న షీలామణి సూచించారు. సోమవారం ఎస్కేయూ క్యాంపస్‌లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయస్థాయి అఖిల భారత ఉన్నత విద్య సర్వే వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రత్నషీలామణి మాట్లాడుతూ విద్యాసంస్థల్లో అఖిల భారత ఉన్నత విద్యా సర్వే సెల్స్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతీయ కార్యశాలలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విశ్వసనీయమైన సమాచారం వల్ల న్యాక్, ఎన్‌ఐఅర్‌ఎఫ్ వంటి గుర్తింపు, ర్యాంకింగ్ ప్రక్రియల్లో సంస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఎస్కేయూ వీసీ ఎన్‌వీఆర్ జ్యోతి కుమార్, జేఎన్‌టీయూ(ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శన రావు, యోగి వేమన విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ బి.రాజశేఖర్ పోర్టల్‌లో డేటా ఎంట్రీ విధానం, వెబ్ డీసీఎఫ్ మార్గదర్శకాలు, ఎన్‌ఐఆర్‌ఎఫ్, క్యూఎస్ ర్యాంకింగ్‌లతో అనుసంధానంపై అవగాహన కల్పించారు. ఎస్కేయూ నోడల్ అధికారి ప్రొఫెసర్ డి.ప్రభాకర్ స్వాగత ప్రసంగం చేశారు.
13 మండలాల్లో నేటి నుంచి
మద్యం దుకాణాల మూసివేత
అనంతపురం సెంట్రల్: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 13 (కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, రాయదుర్గం, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, బుక్కరాయసముద్రం, కణేకల్లు, అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు) మండలాల్లో మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి రామ్మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 26న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ దుకాణాలు మూసివేతలో ఉంటాయన్నారు.


