అనంతపురం కల్చరల్: సమాజహితాన్ని కోరే ప్రగతిశీల సాహిత్యమే రచయిత సృజనకు ప్రామాణికమని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో జాతీయస్థాయి విమలాశాంతి కథా సాహిత్య పురస్కార ప్రదాన కార్యకమ్రం నిర్వహించారు. డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు’ రాసిన మారుతీ పౌరోహితం, ‘గోడవతల’ కథా సంపుటి రాసిన స్వర్ణ కిలారికి విమలాశాంతి స్మారక కథా పురస్కారాలు, మునిసురేష్‌పిళ్లై, శ్రీఊహ, కెంగార మోహన్‌కు ప్రత్యేక కథా పురస్కారాలు అందించారు. డాక్టర్ శాంతినారాయణ మాట్లాడుతూ 2006 నుంచి ప్రసిద్ధ కథకులతోపాటు ఎంతో మందికి విమలాశాంతి పురస్కారాలు అందించినట్లు తెలిపారు. ఆచార్య వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి మాట్లాడుతూ రచయితగా కథలు, నవలలు రాస్తూనే సాటి రచయితలను ప్రోత్సహిస్తున్న శాంతినారాయణ కృషి స్ఫూర్తిదాయకమన్నారు. రచయిత్రి ఆర్.శశికళ, డాక్టర్ అంకే శ్రీనివాస్ పురస్కారాల పుస్తకాల సమీక్ష చేశారు.


