అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా 2026 ఖరీఫ్‌కు సంబంధించిన ఈ–క్రాప్ ప్రక్రియ ఇటీవల పూర్తయ్యింది. ఇందులో ఏకంగా 155 రకాల పంటలు సాగు చేసినట్లు వెల్లడైంది. రాష్ట్రంలో మరే జిల్లాలోనూ ఇన్ని రకాల పంటలు సాగులో లేవని అధికారులు చెప్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మేలైన యాజమాన్య పద్ధతులు అందిపుచ్చుకున్న అభ్యుదయ రైతులు ‘అనంత’ను పంటలకు నిలయంగా మారుస్తున్నారు. ఇక్కడి పొడి వాతావరణం, నేలలు... అన్ని రకాల పంటలకు అనువుగా ఉంటాయని రుజువు చేస్తున్నారు.
ఈ–క్రాప్‌లో 18.36 లక్షల ఎకరాలు :
జిల్లా వ్యాప్తంగా 8,84,246 ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగులోకి రాగా, 3,67,473 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 1,577 ఎకరాల్లో మల్బరీ సాగులో ఉన్నట్లు ఈ–క్రాప్‌లో వెల్లడైంది. మరో 5,82,753 ఎకరాలు బీళ్లుగానే ఉన్నట్లు సర్వేలో నమోదు చేశారు. మొత్తంగా 9,57,451 సర్వే నంబర్ల కింద 18,36,048 ఎకరాలను ఈ–క్రాప్‌లో పొందుపరిచారు. ఈ ఖరీఫ్‌లో జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా కంది పంట ఏకంగా 4,36,157 ఎకరాల్లో సాగు చేయడంతో ఆల్‌టైం రికార్డు జాబితాలో చేరింది. వేరుశనగ 1,98,805 ఎకరాలు, పత్తి 78,665 ఎకరాలు, వరి 64,932 ఎకరాలు, మొక్కజొన్న 50,240 ఎకరాలు, ఆముదం 37,018 ఎకరాల్లో సాగు చేశారు. ఇవి కాకుండా 20 రకాల వ్యవసాయ పంటలు సాగులోకి వచ్చాయి. ఉద్యాన పంటల విషయానికొస్తే .. అత్యధికంగా చీనీతోటలు 95,580 ఎకరాల్లో విస్తరించాయి. ఆ తర్వాత ఎండు మిరప 81,386 ఎకరాలు, అరటి 46,776 ఎకరాలు, మామిడి 41,334 ఎకరాలు, దానిమ్మ 15,548 ఎకరాలు, టమాట 47,097 ఎకరాల్లో సాగు చేశారు. మరో 40 రకాల ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. యాపిల్ 19 ఎకరాలు, అవకాడో 85 ఎకరాలు, జీడి మామిడి 6 ఎకరాలు, కోకా 11 ఎకరాలు, కరివేపాకు 2,547 ఎకరాలు, ఖర్జూరం 120 ఎకరాలు, డ్రాగన్ 212 ఎకరాలు, పామాయిల్ తోటలు 4,246 ఎకరాలు, ఎర్రచందనం 268 ఎకరాల్లో సాగు చేసినట్లు ఈ–క్రాప్‌లో నమోదయ్యాయి.
ప్రతి మండలంలోనూ
50 నుంచి 70 పంటలు..
జిల్లాలో ప్రతి మండలంలోనూ 50 నుంచి 70 రకాల పంటలు సాగు చేసినట్లు ఈ–క్రాప్‌లో నమోదు చేశారు. వరి, వేరుశనగ, కంది, జొన్న, మొక్కజొన్న, పత్తి, ఆముదం, ఉలవ, అలసంద, పెసర, మినుము, సోయాబీన్, రాగి, గోధుమ, సజ్జ, కొర్ర, కుసుమ, పొద్దుతిరుగుడు, చెరకు, పొగాకు, జీలుగ, జనుము, పిల్లిపెసర, మేత జొన్న, మేత మొక్కజొన్న, సరుగుడు, పారాగ్రాస్, జనపనార, నేపియర్, సుబాబుల్ లాంటి వ్యవసాయ, పశుగ్రాసం పంటలు సాగు చేశారు. అలాగే చీనీ, నిమ్మ, దానిమ్మ, మామిడి, జామ, సపోటా, రేగు, అంజూర, అరటి, యాపిల్, ద్రాక్ష, అల్లంనేరేడు, పామాయిల్, కొబ్బరి, బొప్పాయి, ఖర్భూజా, కలింగర, దోస, ఉసిరి, చింత, వెదురు, ఖర్జూరం, డ్రాగన్, కోకా, పనస. సీతాఫలం, అశ్వగంధ, పసుపు, ధనియాలు, ఎండుమిరప, స్ట్రాబెర్రీ, శ్రీగంధం, అకు, వక్క, వాము, నన్నారి, శీఖాకాయి, లిచీ, లాంగాన్ లాంటి ఉద్యాన, ఔషధ పంటలు సాగు చేశారు.
కూరగాయ పంటల విషయానికి వస్తే..
టమాట, మిరప వంగ, బెండ, మిరప, ఉల్లి, గోరుచిక్కుడు, అనుములు, బీట్‌రూట్, క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, ముల్లంగి, సాంబారుదోస, నాలుగైదు రకాల బీన్స్, అల్లం, బీర, కాకర, సొర, బూడిద గుమ్మడి, పొట్ల, అవిశె, కొత్తిమిర, కరివేపాకు, మునుగ, అవకాడో, మకాడమియా, స్వీట్‌కార్న్, బేబీకార్న్, మెంతి, పాలకూర, గోంగూర, గోబీపువ్వు, బచ్చలికూర, చుక్కాకు, వాము, పుదీనా తదితర మరికొన్ని కూరగాయ, ఆకుకూర రకాల పంటలు ఉన్నాయి. బంతి, చామంతి, గులాబీ, కనకాంబరం, లిల్లీ, మల్లె తదితర మరికొన్ని పూలతోటలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి అవసరమైన సాగునీటి వసతి, రాయితీ రూపంలో ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సదుపాయం కల్పించని కారణంగా నష్టాలు చవిచూస్తున్న పరిస్థితి నెలకొంది.
ఏటా పంటల నష్టం..తరచూ కరువు కాటకాలు.. వేరుశనగ, వ్యవసాయ, ఉద్యాన పంటలకే పరిమితమైన ‘అనంత’.. ఇప్పుడు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఎన్నో అరుదైన, విలువైన వాణిజ్య పంటలను సైతం పండించడానికి వెనుకాడడం లేదు. కరువు నేలలోనూ కశ్మీర్ లాంటి
అతిశీతల ప్రాంతంలో పండే యాపిల్ పంట పండించడంలో సక్సెస్ అయ్యింది. ఈ ఖరీఫ్‌లో 155 రకాల పంటలు సాగు చేసినట్లు ఈ క్రాప్‌తో వెల్లడవుతోంది. రైతులు వర్షాభావ పరిస్థితులు.. అరకొర నీటితోనే పంటలు పండిస్తూ అనంత జిల్లాను పంటల ప్రయోగశాలగా ప్రసిద్ధికెక్కించారు.
గతంలో వేరుశనగ, వ్యవసాయ, ఉద్యాన పంటలకే పరిమితం
ఇటీవల అరుదైన
వాణిజ్య పంటలకు ప్రసిద్ధి
కశ్మీర్ లాంటి అతిశీతల ప్రాంతంలో పండే యాపిల్ కూడా సక్సెస్
ఈ ఖరీఫ్‌లో 155 రకాల పంటలు
సాగు చేసిన రైతులు
ఈ–క్రాప్‌తో పంటల లెక్కలు వెల్లడి


