29న రాష్ట్రస్థాయి రాతి దూలం లాగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

29న రాష్ట్రస్థాయి రాతి దూలం లాగుడు పోటీలు

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

బొమ్మనహాళ్‌: మండలంలోని ఉద్దేహాళ్‌ గ్రామంలో హైస్కూల్‌ క్రీడామైదానంలో గజగౌరీ దేవి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 29న రాష్టస్థాయి రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు కాగా, తొమ్మిదో బహుమతి రూ.ఒక్క వెయ్యి వరకు బహుమతులు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏపీఏఎస్‌ ఈసీ మెంబర్‌గా ఆచార్య సుధాకరబాబు

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు(ఏపీఏఎస్‌ ఈసీ మెంబర్‌)గా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌, పర్యావరణ రసాయన శాస్త్రవేత్త ఆచార్య కె.సుధాకర్‌బాబు ఎంపికయ్యారు. ఆదివారం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అకాడమీ అధ్యక్షుడిగా ఆచార్య దయానంద, కార్యదర్శిగా ఆచార్య బసవేశ్వరరావు ఎంపిక కాగా, 14 మంది సభ్యుల బృందం ప్రజలకు శాసీ్త్రయ అవగాహన పెంపొందించేలా సదస్సులు నిర్వహించనుంది. ఇందులో సుధాకర్‌ బాబుకు చోటు దక్కడంపై పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకులు అభినందనలు తెలిపి, సత్కరించారు.

రైల్వే ట్రాక్‌ భద్రతపై

డీఆర్‌ఎం తనిఖీ

గుంతకల్లు: నంద్యాల నుంచి గుంతకల్లు వరకు రైల్వే ట్రాక్‌ భద్రత, నిర్వహణ ప్రమాణాలను పరిశీలించేందుకు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్తా ఆదివారం విండో ట్రైలింగ్‌ తనిఖీ నిర్వహించారు. రైల్వే ట్రాక్‌ల స్థితిగతులు, ట్రాక్‌ జామెట్రీ, ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, కీలక భద్రతా మౌలిక సదుపాయాలను డీఆర్‌ఎం పరిశీలించారు. ట్రాక్‌ల నిర్వహణ ప్రమాణాలను సమీక్షించి, మరింత మెరుగుపరచాల్సిన ప్రాంతాలను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

విద్యుత్‌ తీగలు తగిలి

కార్మికుడు మృతి

రాప్తాడు రూరల్‌: అనంతపురం నగర శివారులోని బళ్లారి రోడ్డులో భవన నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అనంతపురం రూరల్‌ మండలం పాపంపేట బసవతారకనగర్‌కు చెందిన హెచ్‌.రామ్మోహన్‌ (32) నిర్మాణ పనుల్లో కడ్డీల కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బళ్లారి రోడ్డులో ఈశ్వరయ్య ఇంటి నిర్మాణ పనులకు వెళ్లాడు. నాలుగో అంతస్తుకు కడ్డీలు తీసుకెళ్తుండగా పైన ఉన్న 11 కేవీ విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురై కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రామ్మోహన్‌ను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఓబులేసు ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పచ్చమూకల పైశాచికం

పెద్దవడుగూరు:ప్రాదేశిక ఎన్నికల్లో ‘పచ్చ’ మూకలు పైశాచికత్వంతో ప్రజలు విసిగిపో యారు. పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన సర్పంచు అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా అడ్డుపడుతున్నారు. మండలంలో 25 పంచాయతీలకు రెండో రోజు ఆదివారం సర్పంచు, వార్డు సభ్యుల నామినేషన్‌ ప్రక్రియ కొనసాగింది. ఉదయం నుంచి నామినేషన్‌ సెంటర్ల వద్ద టీడీపీ మూకలు చేరి, వైఎస్సార్‌సీపీ సర్పంచు అభ్యర్థులను అడుగడుగునా అడ్డుకున్నారు. మందస్తుగానే బెదిరింపులకు పాల్పడ్డారు. బీమునిపల్లి, కండ్లగూడూరు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్‌ వేయడానికి మేడిమాకులపల్లికి వెళ్లగా, టీడీపీ మూకలు వారిపై దాడులకు తెగబడ్డాయి. నామినేషన్‌ పత్రాలను చింపివేశాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement