రాప్తాడు రూరల్: మండలంలోని మరూరు పంచాయతీ చాపట్ల గ్రామంలో వెలసిన మారెమ్మ ఆలయ అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ నాయకులు రూ.5 లక్షల విరాళం అందించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సూచనల మేరకు రాప్తాడు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు హేమావతి, వైఎస్సార్‌సీపీ నాయకులు చెన్నారెడ్డి, మనోహర్ రెడ్డి, సాకే హరి, బీరే రామకృష్ణ తదితరులు ఆదివారం చాపట్ల గ్రామానికి వెళ్లారు. గ్రామపెద్దలకు రూ.5లక్షల నగదు అందించారు. మారెమ్మ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ అవసరమైన అభివృద్ధిపనులకు సహకారం అందిస్తామని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
కుటుంబ కలహాలతో
వివాహిత ఆత్మహత్య
కుందుర్పి: మండలంలోని జంబుగుంపలలో బేబి (25) కుటుంబ కలహాలతో ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. బేబీ భర్త ఉపాధి కర్ణాటక ప్రాంతంలోని హిరుయూరు ప్రాంతానికి వెళ్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, భర్త ఇంట్లోలేకపోవడం తదితర సమస్యలతో బేబీ మనస్తాపానికి గురైంది. ఆదివారం తెల్లవారుజామున ఇంటి పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి
కూడేరు: మండల పరిధిలోని కరుట్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దివాకర్ (34) కమ్మూరు సమీపంలో ఆటోబోల్తాపడి శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఆదివారం పోలీసులు తెలిపిన మేరకు.. మండల పరిధిలోని కరుట్లపల్లికి చెందిన దివాకర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య, కుమారుడు ఉన్నారు. శనివారం అనంతపురం నుంచి కమ్మూరుకు లగేజీని తీసుకెళ్లి, అక్కడ నుంచి రాత్రి తిరిగి వస్తుండగా కల్వర్ట్ దగ్గర ఆటో ఆదుపు తప్పి బోల్తా పడింది. దీంతో దివాకర్ తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మృత దేహాన్ని అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
తారకాపురంలో
పట్టపగలే భారీ చోరీ
బొమ్మనహాళ్: మండలంలోని తారకాపురంలో ఆదివారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కుమారస్వామి ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి చేరగా, తాళాలు పగిలిపోయి ఉండటాన్ని గమనించారు.ఇంట్లోకి వెళ్లి చూస్తే బీరువా పగలగొట్టి ఉంది. అందులో పరిశీలించగా 10 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.50 వేల నగదు, రూ. 30 లక్షలకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు, బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన పత్రాలు అపహరణకు గురైనట్లు బాధితుడు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు.


