ప్రాదేశికం ముగింది.. పంచాయతీ ఎన్నికల కోడ్ కూసింది.. ఎన్నికలేవైనా అధికారం మాదే.. అడ్డుకునేవారెవరు అన్న రీతిలో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. ఓ వైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. మరోవైపు యథేచ్ఛగా ఓటర్లకు ‘కుక్కర్లు’ పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కళ్యాణదుర్గం మండలంలోని గోళ్లగ్రామంలో టీడీపీ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా, పంచాయతీ ఎన్నికల్లో 1,2,4,5,6,7,8,12 వార్డుల్లో టీడీపీ వార్డు మెంబర్ల అభ్యర్థుల ఎన్నికల గుర్తు కుక్కర్ కావడం కొసమెరుపు. దీంతో గోళ్ల పంచాయతీ మొత్తం కుక్కర్లు పంపిణీకి శ్రీకారం చుట్టారు. పంచాయతీలో 12 వార్డులు ఉండగా 8 వార్డుల వార్డు మెంబర్ల గుర్తులు కుక్కర్లు రావడం విశేషం. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు టీడీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. – కళ్యాణదుర్గం రూరల్:


