అమడగూరు: మండలంలోని జేకేపల్లి సర్పంచ్ స్థానానికి జనసేన మద్దతుతో పోటీ చేస్తున్న ఉత్తప్ప కిడ్నాప్ అయ్యాడు. టీడీపీ నాయకులే ఈ పని చేశారని జనసేన నాయకులు అమడగూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఉత్తప్పను స్థానిక టీడీపీ నాయకులు ఒత్తిడి చేశారు. ఇందుకు అతను ససేమిరా అన్నాడు. దీంతో ఆదివారం సాయంత్రం ఉత్తప్ప ఇంట్లో ఉండగా టీడీపీ నాయకులు వచ్చి ‘నీతో మాట్లాడేది ఉంది’ అంటూ బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు. స్థానిక టీడీపీ నాయకులు కమ్మల లక్ష్మినారాయణ, తనకంటి నరేంద్ర, కమ్మల పెద్దన్నయ్య, మరికొందరు కలసి కిడ్నాప్ చేశారని ఉత్తప్ప కుమార్తె తేజస్విని తెలిపారు. ఈ మేరకు జనసేనకు చెందిన మార్కెట్‌యార్డు చైర్మన్ పూల శివప్రసాద్, ఆ పార్టీ నాయకులు తోట్ల గంగాధర్ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఎస్‌ఐ గోపాల్‌కృష్ణ మాట్లాడుతూ ఉత్తప్ప ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే కనుగొంటామని తెలిపారు.
టీడీపీ నాయకులే చేశారని ఫిర్యాదు


