● సర్పంచ్ స్థానాలకు 997, వార్డులకు 3,058 నామినేషన్ల ఆమోదం
● తిరస్కరణలపై నేడు ఆర్డీఓ వద్ద అప్పీళ్లకు అవకాశం
అనంతపురం ఎడ్యుకేషన్: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగిసింది. రెండో విడతలో ఎన్నికలు జరగనున్న 186 గ్రామపంచాయతీల పరిధిలో అధికారులు నామినేషన్లను పరిశీలించి అర్హత ఉన్న వాటికి ఆమోదం తెలిపారు. మొత్తం 186 సర్పంచ్ స్థానాలకు 1,286 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 997 నామినేషన్లకు ఆమోదం లభించింది. వివిధ కారణాలతో మిగిలిన 289 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అలాగే 1,794 వార్డు సభ్యుల స్థానాలకు 3,202 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 3,058 నామినేషన్లకు అధికారులు ఆమోదం తెలిపారు. వివిధ కారణాలతో 144 నామినేషన్లను తిరస్కరించారు.
నేడు అప్పీళ్లు
తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యర్థులు ఆదివారం ఆర్డీఓల వద్ద అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ అప్పీళ్లపై ఈ నెల 23వ తేదీన పరిష్కార చర్యలు చేపట్టనున్నారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో రెండో విడత ఎన్నికల ప్రక్రియ తదుపరి దశకు చేరుకుంది.


