అనంతపురం న్యూ టౌన్: ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు గౌరవ వేతనం ఇవ్వాలంటూ సచివాలయ ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 5,184 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. వీరందరినీఇటీవల జరిగిన మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనులు చేసేందుకు వినియోగించుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా ఎన్నికలకు సంబంధించిన గౌరవ వేతనం ఇవ్వడం లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రమకు దక్కని ఫలితం
జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో కనీసం నాలుగు నుంచి పది రోజులపాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పని చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సచివాలయ సిబ్బంది తక్కువగా ఉండటంతో గ్రామ సచివాలయ సిబ్బందిని వినియోగించారు. ఎన్నికల అధికారులు వాస్తవానికి సచివాలయ సిబ్బందిని దూరం పెట్టాలని భావించారు. అయితే క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించి కొన్ని గంటల ముందు విధులకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలామంది ఉద్యోగులు అనేక వ్యయప్రయాసలకోర్చి విధులకు హాజరయ్యారు. ఎన్నికల సందర్భంగా కనీసం వారికి భోజనం, తాగునీరు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు విమర్శలు వినిపించాయి.
స్పందించేవారేరీ?
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి గౌరవ వేతనం ఎంతివ్వాలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ అసిస్టెంట్లు / వార్డు సెక్రటరీలు లేదా సమాన కేడర్ ఉన్న వారికి రోజుకు రూ.600 చొప్పున 15 రోజులకు రూ.9000, ఇతర ఉద్యోగులు / సిబ్బందికి రోజుకు రూ.400 చొప్పున 15 రోజులకు రూ 6,000, మాస్టర్ ట్రైనర్‌కు రోజుకు రూ.800 చొప్పున చెల్లించాలని స్పష్టంగా ప్రకటించింది. అయితే ఇంత వరకూ అధికారులు గౌరవ వేతనం గురించి పట్టించుకోవడం లేదు.
గౌరవ వేతనం ఇప్పించండి
జిల్లాలో జరిగిన ఎన్నికల విధుల్లో పాల్గొన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల భత్యం చెల్లించాలని జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. స్థానిక కార్పొరేషన్ ఎన్నికల నందు ఎన్నికల విధులు లో భాగంగా బూత్ లెవెల్ అధికారులుగా ఓటర్ స్లిప్పుల పంపిణీ చేయడంతో పాటు ఇతర ఎన్నికల విధుల్లో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులకు గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. జేఏసీ నాయకులు డి సుధాకర్, వి లక్ష్మీనారాయణ, యు మల్లికార్జున, ఎంకే వరప్రసాద్, సిరాల చంద్ర, చిన్నూరప్ప, శివశంకరయ్య, రామకృష్ణ, రవికుమార్ ,మహేష్ నాయక్, వెంకటాద్రి, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సచివాలయ సిబ్బందికి అందని గౌరవ వేతనం
పట్టించుకోని అధికారులు
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వైనం


