సాక్షి ప్రతినిధి, అనంతపురం:
జిల్లాలో 31 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో గుత్తి, పామిడి, గుంతకల్లు స్థానాలకు ఇతరులెవ్వరూ నామినేషన్లు వేయకుండా టీడీపీ బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 28 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. కూటమి నేతలు తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో రిగ్గింగ్ చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసి వారిని బయటికి గెంటి యథేచ్ఛగా ఓట్లు దండుకున్నారు. అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 26 స్థానాల్లో గెలుపొందారు.
బీసీ వర్గానికి రిజర్వ్ కావడంతో...
జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానం బీసీకి రిజర్వ్ అయ్యింది. బీసీలో కురబ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉరవకొండ నుంచి గెలిచిన చిరంజీవి, గార్లదిన్నె నుంచి గెలుపొందిన నాగరాజు, బుక్కరాయసముద్రం నుంచి గెలిచిన ఉజ్జినమ్మ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. మిగిలిన వారు తమకు తెలిసిన మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆర్థికంగా ఉన్నవారికే అవకాశమివ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
తీవ్రంగా ప్రయత్నిస్తున్న మంత్రి కేశవ్..
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన అనుచరునికి జెడ్పీ చైర్మన్‌గిరిని కట్టబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం మేయర్ సీటు కూటమి తరఫున బీజేపీకి ఇస్తారనే ముందస్తు సమాచారంతో ఆయన అందులో జోక్యం చేసుకోలేదు. దీంతో జెడ్పీ పీఠాన్ని తన అనుచరునికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం వద్ద తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఉరవకొండ నుంచి గెలిచిన చిరంజీవి గతంలో సర్పంచ్‌గా గెలిచారు. మొదటి నుంచి పయ్యావులకు అతి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. దీంతో చిరంజీవిని చైర్మన్‌ను చేసేందుకు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.
ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో...
శింగనమల మండలం జూలాకాల్వకు చెందిన గంజే నాగరాజు మొట్టమొదటి సారిగా ఎన్నికల బరిలో నిలిచారు. శింగనమల జెడ్పీటీసీ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆయన గార్లదిన్నె నుంచి పోటీ చేసి గెలిచారు. ఫర్టిలైజర్స్, మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. మొదటి నుంచి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాస్ వెంట నడుస్తూ ఆయనకు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. నాగరాజు అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణిశ్రీ, దగ్గుపాటి, కాలవ శ్రీనివాస్, అమిలినేని సురేంద్రబాబు, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. నాగరాజుకు జెడ్పీ పీఠం దక్కేలా కాలవ పార్టీ హైకమాండ్ వద్ద చక్రం తిప్పుతున్నట్లు చర్చ నడుస్తోంది.
ఉజ్జినమ్మను అదృష్టం వరించేనా..?
జెడ్పీ చైర్ పర్సన్ స్థానానికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. వాస్తవంగా మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకున్నట్లే జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ప్రత్యక్ష పద్ధతి పెట్టే ఆలోచనలో టీడీపీ ఉండేది. అయితే వైఎస్సార్సీపీ బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉండడంతో మళ్లీ వెనకడుగు వేసి పరోక్ష పద్ధతిలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఒక్క రోజే సమయం ఉండడంతో బుక్కరాయసముద్రం నుంచి గెలిచిన ఉజ్జినమ్మ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈమె కుటుంబం ఆర్థికంగా ఓ మోస్తరుగా ఉండడంతో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠంపై ఉత్కంఠ వీడడం లేదు. సీటు ఎవరిని వరిస్తుందో తెలియక ఆశావహులంతా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20న జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు ఎటూ తేల్చడం లేదు. జిల్లా నేతల నుంచి సిఫార్సులు అందుకుంటూనే ఉన్నా ఎవరికి ఇచ్చేది తేల్చకుండా నాన్చుతూ ఉంది. దీంతో జెడ్పీటీసీ అభ్యర్థులంతా ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.


