ప్రశాంతి నిలయం: పుట్టపర్తిలో సత్యసాయి శత వర్ష జయంతి వేడుకలు కనుల పండువగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడు, వేణుగోపాలస్వామి, సత్యసాయి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. పూజా క్రతువులో గణపతి పూజ, కుంకుమ పూజ, దేవీ అష్టోత్తర నామం, కలష పూజ నిర్వహించారు. అనంతరం వేద పండితులు సత్యసాయి సత్యనారాయణ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేయించారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన 1100 జంటలు సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు. పండితుల వేద ఘోషతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. కలెక్టర్ శ్యాంప్రసాద్ దంపతులు సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు.
ఘనంగా సత్యసాయి రథోత్సవం..
సాయికుల్వంత్ సభా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సీతారామ లక్ష్మణ సమేత హనుమ, వేణుగోపాలస్వామి, సత్యసాయి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా సాయికుల్వంత్ సభా మందిరం నుంచి ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత బంగారు సత్యసాయి ప్రతిమను ప్రత్యేకంగా చేయించిన వెండిరథంపై కొలువుదీర్చారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యులు సత్యసాయి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యసాయిని స్మరిస్తూ పురవీధులలో వెండి రథం ముందుకు సాగింది. తమ ఇష్టదైవం సత్యసాయిని స్మరిస్తూ భక్తులు రథాన్ని లాగుతూ పుట్టపర్తి పురవీధులలో ముందుకు సాగారు. అనంతరం పెద వెంకమరాజు కల్యాణ మండపం వద్ద మంగళహారతి ఇచ్చి ఆర్‌జె.రత్నాకర్ రాజు దంపతులు రథోత్సవాన్ని ముగించారు.
అంగరంగ వైభవంగా సత్యసాయి
శత వర్ష జయంతి ఉత్సవాలు
కనుల పండువగా
సత్యసాయి రథోత్సవం


