కణేకల్లు: సర్పంచ్ నామినేషన్ల స్క్రూటినీలో అధికారులు ‘పచ్చ’పాతం ప్రదర్శించారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి... వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లను రిజెక్ట్ చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో బుధవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో కళేకుర్తి సర్పంచ్ నామినేషన్ల పరిశీలన ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ మద్దతుతో బోయ సునీత, బోయ రాధమ్మ నామినేషన్ వేయగా.. టీడీపీ మద్దతుతో ఇద్దరు నామినేషన్లు వేశారు. పరిశీలన సమయంలో అధికారులు తొలుత టీడీపీ మద్దతుదారుల అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల పరిశీలన సమయంలో టీడీపీ నేతలు సుదర్శన్ తదితరులు అనేక అభ్యంతరాలు తెలిపారు. బోయ సునీత వాస్తవానికి 7వ తరగతి చదివి డ్రాపౌట్ అయ్యింది. నామినేషన్ పత్రంలో ఎడ్యుకేషన్ వివరాలు రాయలేదని.. ఆమె చదువుకుందంటూ టీడీపీ నేతలు స్టడీ సర్టిఫికెట్ తెచ్చి సునీత నామినేషన్‌ను రిజెక్ట్ చేయించారు. మరో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు రాధమ్మ తన అవసరం కోసం ఆశీర్వాద్ ప్రైవేటు ఫైనాన్స్‌లో రూ.74వేలు అప్పు తీసుకున్నట్లు నామినేషన్ పత్రంలో నమోదు చేసింది. అయితే ఆమె అప్పు రూ.74,900 ఉంటే తక్కువ చూపించిన కారణంగా నామినేషన్‌ను రిజెక్ట్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులు రాధమ్మ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఆర్‌ఓతో వాగ్వాదానికి దిగారు. అధికారపార్టీ నేతల కుట్రలు, ఒత్తిళ్లకు తలొగ్గి అతి చిన్న పొరపాట్లను సాకుగా చూపి నామినేషన్‌ను ఎలా తిరస్కరిస్తారంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.ఉషారాణి ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ లాయర్లు వెంకటరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి కూడా ఆర్‌ఓతోపాటు అక్కడున్న అధికారులతో చర్చించారు. ఇవేమీ పెద్ద తప్పులు కావని, పొరపాట్లని, వీటికి కుంటిసాకులు చూపి రిజెక్ట్ చేయడం సబబు కాదన్నారు. ఇదే సమయంలో పోలీసులు వచ్చి వైఎస్సార్‌సీపీ నాయకులను బలవంతంగా బయటకు పంపించేశారు. అధికారులు, పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.ఉషారాణి, నాయకులు జయరామిరెడ్డి, భాస్కర్‌రెడ్డితోపాటు సర్పంచు అభ్యర్థులు, కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నామినేషన్ పత్రాలను టీడీపీ నేతలు దొంగదారిలో తెప్పించుకుని, చిన్నచిన్న కారణాలను తమకు అనుకూలంగా మలచుకుని నామినేషన్ల తిరస్కరణకు కుట్ర పన్నారని మండిపడ్డారు.
కళేకుర్తి సర్పంచ్ వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ


