కళ్యాణదుర్గం రూరల్: ఆ గ్రామంలో మద్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. కానీ తాగడానికి నీరు మాత్రం ఉండదు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వివరాల్లోకెళ్తే.. కళ్యాణదుర్గం మండలం పాలవాయిలో దాదాపు రెండు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 600 దాకా జనాభా ఉంది. ఇక్కడ పంచాయతీ బోరు ద్వారా కొళాయిలకు తాగునీరు సరఫరా అయ్యేది. రెండు నెలలుగా బోరులో నీరు అడుగంటింది. త్రీఫేస్ కరెంటు ఉన్నప్పుడు ఒక గంట మాత్రమే నీరు వదులుతారు. అది కూడా కొళాయిల్లో అరకొరగా నీరు వస్తోంది. ఈ నీటిని పట్టుకోవడానికి గ్రామస్తులు పనులు వదులుకుని మరీ బిందెలతో కొళాయిల వద్దకు చేరుతున్నారు. కానీ అక్కడ రెండు బిందెలు కూడా దొరకడం లేదు. మరోవైపు గ్రామంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన వైన్షాపులకు సంబంధించి అనధికారికంగా నాలుగు బెల్టుషాపులు ఉన్నాయి. ఇక్కడ ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో మద్యం దొరుకుతోంది. తాగునీటి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ, సచివాలయ అధికారులు, ఎంపీడీఓ దృష్టికి తీసుకుపోయినా పరిష్కరిస్తామంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ, కొత్తగా బోరు వేయించేందుకు కానీ ముందుకు రావడం లేదు. ఇక ముఖ్య ప్రజాప్రతినిధి ఏమో మద్యం వ్యాపారంపై ఉన్న శ్రద్ధ తాగునీటి సౌకర్యం కల్పించడంలో చూపడం లేదని గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు.
పాలవాయిలో దాహం కేకలు
పట్టించుకోని ముఖ్య ప్రజాప్రతినిధి


