సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు

Nov 17 2026 1:26 AM | Updated on Nov 17 2026 1:26 AM

గుంతకల్లు: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం దక్షిణ తూర్పు రైల్వే ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది. ఈమేరకు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటన విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సంత్రాగచ్చి నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం వరకు నడుపుతున్నారు. రైలు నంబర్‌ 08031 సంత్రాగచ్చి రైల్వేస్టేషన్‌ నుంచి 17, 24వ తేదీల్లో మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో రైలు నంబర్‌ 08032 ఈనెల 18, 25వ తేదీల్లో ఉదయం 8 గంటలకు ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.00 గంటలకు సంత్రాగచ్చికు చేరుతుందన్నారు. ఈ రైలు ఖరగ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌, జాజ్‌పూర్‌, కటక్‌, భువనేశ్వర్‌, ఖుర్దారోడ్‌, బ్రహ్మపూర్‌, పలాస, విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్‌, గుత్తి, అనంతపురం, ధర్మవరం మీదుగా ప్రయాణిస్తుంది.

జనగణనలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు

అనంతపురం అర్బన్‌: ‘జనగణన సర్వే క్రమంలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు. ప్రతి వ్యక్తి వివరాలు సమగ్రంగా సేకరించాలి. నిర్దేశించిన ఫార్మెట్‌లో పూరించాలి. ఈ అంశాలపై ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి.’ అని డీఆర్‌ఓ ఎ.మలోల సంబంధిత ఫీల్డ్‌ ట్రైనర్లను ఆదేశించారు. జనగణన–2027 రెండో దశ జనాభా గణనపై సోమవారం జేఎన్‌టీయూలోని సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం సెమినార్‌ హాల్‌లో ఫీల్డ్‌ ట్రైనర్లకు శిక్షణ తరగతి నిర్వహించారు. డీఆర్‌ఓ మట్లాడుతూ జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయి పనిచేసే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు జనగణనపై ఫీల్డ్‌ ట్రైనర్లు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సెన్సెస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డిబాకర్‌ బరిహ, గణాంకాధికారులు దీపక్‌ భరద్వాజ్‌, సూర్యవర్ధన్‌రెడ్డి, మాస్టర్‌ ట్రైనర్లు కిరణ్‌, జీఎల్‌ఎన్‌స్రసాద్‌, సెన్సెస్‌ డీటీ మధుసూదన్‌రావు, ఫీల్డ్‌ ట్రైనర్లు పాల్గొన్నారు.

పంటల బీమా పథకం అమలు

అనంతపురం అగ్రికల్చర్‌: రబీలో పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఎన్‌.సాలురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘పంటల బీమాపై మౌనం’ శీర్షికతో ఈనెల 12న సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ప్రధాన మంత్రి ఫసల్‌బీమా పథకం కింద గ్రామం యూనిట్‌గా పప్పుశనగ, మండలం యూనిట్‌ కింద వరి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న పంటలు నోటిఫై చేసినట్లు పేర్కొన్నారు. వరి సాగు చేసే రైతులు డిసెంబర్‌ 31లోపు, మిగతా పంటలకు డిసెంబర్‌ 15 లోపు బీమా కింద తమ వాటా ప్రీమియం చెల్లించాలన్నారు. పప్పుశనగ ఎకరాకు రూ.30 వేలు బీమా పరిహారం ఖరారు చేయగా రైతులు తమ వాటా కింద రూ.450 ప్రకారం ప్రీమియం చెల్లించాలన్నారు. వేరుశనగ ఎకరాకు రూ.32 వేలు కాగా రూ.480 ప్రకారం ప్రీమియం కట్టాలన్నారు. జొన్నకు రూ.21 వేలు ఖరారు చేయగా ప్రీమియం రూ.315 ప్రకారం, మొక్కజొన్నకు రూ.35 వేలు పరిహారం ఖరారు చేయగా... రూ.525 ప్రకారం ప్రీమియం చెల్లించాలని తెలిపారు. వరి ఎకరాకు రూ.42 వేలు కాగా ప్రీమియం రూ.630 చెల్లించాలన్నారు. పంట కోత ప్రయోగాల ఆధారంగా దిగుబడులు పరిగణలోకి తీసుకుని బీమా కింద పరిహారం లెక్కిస్తారన్నారు. ఈ–క్రాప్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. మధ్యవర్తులు, దళారులను నమ్మకుండా రైతులు స్వయంగా బ్యాంకులు లేకపోతే మీ–సేవా, సీఈసీ సెంటర్లలో ప్రీమియం చెల్లించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement