అనంతపురం : రాయలసీమ విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రధాన ఆధారమైన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశాల వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది. ఒకవైపు యూనివర్సిటీలో వందలాది సీట్లు భర్తీ కాక ఖాళీగా పడి ఉండటం, మరోవైపు వాటిని భర్తీ చేసేందుకు తక్షణమే ’స్పాట్ అడ్మిషన్లు’ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు గొంతెత్తి నినదిస్తున్నా ప్రభుత్వం , ఉన్నత విద్యామండలి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కళ్లముందే వందలాది సీట్లు ఖాళీ
2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మొత్తం 1,160 పీజీ సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో 201 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. ఆర్ట్స్ విభాగాల్లో తెలుగు, ఇంగ్లిష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సోషియాలజీ వంటి కోర్సుల్లో సింగిల్ డిజిట్ సంఖ్యలోనే ప్రవేశాలు జరిగాయి. సైన్స్ విభాగాలైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్‌తో పాటు ఎంకాం, ఎంపీఈడీ, ఎంఎస్‌డబ్ల్యూ వంటి కోర్సుల్లోనూ భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఇంతటి దయనీయ పరిస్థితి నెలకొన్నప్పటికీ, మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
విద్యార్థి సంఘాల పోరు.. వీసీకి వినతులు
ప్రైవేట్ కళాశాలల్లో పీజీ కోర్సులకు భారీ ఫీజులను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీలో చదువుకోవాలని ఆశపడుతున్న ఎందరో విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లే ఏకై క మార్గం. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను పారదర్శకంగా ప్రకటించి, వెంటనే స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు ఇటీవల వీసీకి వినతిపత్రాలు సమర్పించారు. ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వ స్థాయిలో చలనం లేకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో వర్సిటీకి తీరని నష్టం
ఇప్పటికే ఏపీపీజీసెట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో చాలామంది విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లారు. దీనికి తోడు సాంప్రదాయ కోర్సుల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడం, రెగ్యులర్ అధ్యాపకుల కొరత, ప్రైవేట్ యూనివర్సిటీల పోటీ వంటి కారణాలతో అడ్మిషన్లు పడిపోయాయి. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లను నిర్లక్ష్యం చేస్తే విశ్వవిద్యాలయానికి రావాల్సిన అంతర్గత ఆదాయం (ఫీజులు) పూర్తిగా తగ్గుముఖం పట్టనుంది. విద్యార్థులు లేక హాస్టళ్లు కళావిహీనంగా మారి, కొన్ని విభాగాల మనుగడకే ముప్పు వాటిల్లుతోంది.
1,160 సీట్లలో 201 మాత్రమే భర్తీ
స్పాట్ అడ్మిషన్లను పట్టించుకోని ప్రభుత్వం
పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం


