రెండో విడత పల్లె పోరు షురూ | - | Sakshi
Sakshi News home page

రెండో విడత పల్లె పోరు షురూ

Nov 17 2026 1:26 AM | Updated on Nov 17 2026 1:26 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: రెండోవిడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి తెరలేచింది. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడు సోమవారం అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 9 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. అనంతపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఆరు మండలాలు, గుంతకల్లు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మూడు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.

9 మండలాలు.. 186 పంచాయతీలు

రెండో విడతలో శింగనమల, నార్పల, పుట్లూరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొమ్మిది మండలాల పరిధిలో మొత్తం 186 సర్పంచ్‌, 1,794 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..

ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపడతారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ అధికారి వద్ద 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. 23న అప్పీళ్లను పరిష్కరిస్తారు. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 29 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఏదైనా కారణంతో రీపోలింగ్‌ అవసరమైతే 30న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి, అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

పల్లెల్లో మొదలైన రాజకీయ వేడి

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. సర్పంచ్‌ పదవులతో పాటు వార్డు స్థానాలను దక్కించుకునేందుకు అభ్యర్థులు వ్యూహాలకు పదును పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో మద్దతుదారుల సమీకరణ, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ఊపందుకోనున్నాయి. నామినేషన్ల ఘట్టంతో మొదలుకానున్న ఈ పల్లెపోరు.. ఈ నెల 29న ఓటర్ల తీర్పుతో ముగియనుంది. మొత్తం 3,70,865 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,84,769 మంది పురుషులు, 1,86,056 మంది మహిళలు, 40 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.

9 మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

186 పంచాయతీలు,

1,797 వార్డులకు ఎన్నికలు

18 నుంచి నామినేషన్లు, 29న పోలింగ్‌, అదేరోజు ఫలితాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement