అనంతపురం టవర్‌క్లాక్: లాఠీలు, తూటాలకు భయపడే ప్రసక్తే లేదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్ అన్నారు. నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ రోజున పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడికి వ్యతిరేకంగా సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీన 10, 11వ డివిజన్లలో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ 30 నుంచి 40 మంది అనుచరులతో పోలింగ్ బూతుల్లోకి వచ్చి రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. దీన్ని తమ పార్టీ యువజన నాయకులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారన్నారు. అనంతరం వచ్చిన పోలీసులు రిగ్గింగ్‌కు పాల్పడిన వారిని వదిలేసి తమ పార్టీ వారిపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారన్నారు. ఎమ్మెల్యే, అయన అనుచరులు, లాఠీచార్జ్ చేసిన స్పెషల్ పార్టీ పోలీసులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఎమ్మెల్యే అయిన తర్వాత నగరంలో దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోయాయని, సీపీఐ ఆధ్వర్యంలో వాటిని అడ్డుకుంటామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యరద్శి పాళ్యం నారాయణస్వామి, నాయకులు లింగమయ్య, బాషా, రమణయ్య, పద్మావతమ్మ తదితరులు పాల్గొన్నారు.


