న్యూస్‌రీల్
అనంతపురం మార్కెట్ యార్డులో మంగళవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.15 వేలు, కనిష్టం రూ.7 వేలు పలికాయి.
బుధవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2026
అధికార మదంతో అమిలినేని చేసిన అరాచకంపై జనాగ్రహం పెల్లుబికింది. ‘స్థానిక’ ఎన్నికల్లో ఓటమి నుంచి బయటపడేందుకు గూండాలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లపై భౌతికదాడులకు దిగడాన్ని ప్రజలు అసహ్యించుకున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి హింసను ప్రోత్సహిస్తూ అడ్డదారుల్లో గెలవడానికి చేసిన ప్రయత్నాలను ముక్త కంఠంతో ఖండించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా కళ్యాణదుర్గంలో కదం తొక్కారు.
కళ్యాణదుర్గం: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ వరకు జరిగిన అమిలినేని దౌర్జన్యాలను నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో మంగళవారం కళ్యాణదుర్గంలో చేపట్టిన శాంతియుత ర్యాలీ విజయవంతమైంది. పార్టీ కార్యాలయం వద్ద నుంచి వేలాదిమంది పార్టీ శ్రేణులు, ప్రజలతో మహర్షి వాల్మీకి విగ్రహం మీదుగా అనంతపురం ప్రధాన రహదారిలోని వైఎస్సార్ పార్క్ వరకు ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ నేత జీకే కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ర్యాలీకి వామపక్షాలు, ప్రజా, కుల సంఘాల నాయకులు మద్దతు తెలిపి పాల్గొన్నారు. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అమిలినేని తన రౌడీ మూకలతో సాగించిన దౌర్జన్య పర్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్సార్ పార్క్‌లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కలెక్టర్, ఎస్పీ విఫలమయ్యారని విమర్శించారు. అనుమతి లేకున్నా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బౌన్సర్లు, అనుచరులు, గూండాలు పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లోకి చొచ్చుకొచ్చి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, అభ్యర్థులపై దాడులు చేశారని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే అమిలినేని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలిచే అవకాశం ఉందని కౌంటింగ్ హాలులో అధికారులు చెప్పారని, అయినా అక్రమ మార్గంలో అధికార పార్టీ వారు ఫలితాలను తారుమారు చేసి, ప్రజల తీర్పును అవహేళన చేశారన్నారు. తమ పార్టీ అభ్యర్థులకు జరిగిన అన్యాయాలపై కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.
వైఎస్సార్‌సీపీ అంటే అమిలినేనికి భయం
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వైఎస్సార్‌సీపీ అంటేనే భయపడిపోతున్నారని జిల్లాపరిషత్ మాజీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ కోసం, ఎస్‌ఆర్‌సీ కంపెనీ ఈ స్టాంప్ కుంభకోణాలపై ఏ విధంగా పోరాడి విజయం సాధించారో.. అదే రీతిలో స్థానిక ఎన్నికల్లో గెలిచినా డిక్లరేషన్ ఇవ్వని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు కలసికట్టుగా పనిచేసి పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి
అన్ని రాజకీయ పార్టీలూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు మాదినేని ఉమా మహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గాన్ని దోపిడీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే అమిలినేని దౌర్జన్యాలను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలని కోరారు. భవిష్యత్‌లో విండ్ పవర్ పేరిట పేదల భూములు బలవంతంగా లాక్కుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. అమిలినేని గూండాలు, బౌన్సర్లు, అల్లుళ్లు, ఎస్‌ఆర్‌సీ భాగస్తులు కౌంటింగ్ కేంద్రంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి టీడీపీ అభ్యర్థులను అక్రమ మార్గంలో గెలిపించుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఎన్నికల్లో అక్రమాలకు సహకరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సాధారణమని, కానీ కళ్యాణదుర్గంలో ఇలాంటి దౌర్జన్యాలను ఎన్నడూ చూడలేదన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలిచిన స్థానాలకు కూడా డిక్లరేషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ నేత జీకే కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎమ్మెల్యే అమిలినేని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హిట్లర్‌ను తలపించేలా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే తన పంథా మార్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాల కన్వీనర్లు సుధీర్, గోళ్ల సూరి, హనుమంతరాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఎస్ రాయుడు, గొల్ల హనుమంతరాయుడు, వెంకటప్ప, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణపురం వెంకటేశులు, సంయుక్త కార్యదర్శులు దొడగట్ట నారాయణ, ములకనూరు తిమ్మరాయుడు, టైలర్ వన్నూరుస్వామి, గుర్రం లింగప్ప, రామాంజినేయులు, అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు బొమ్మయ్య, రేవన్న, హరినాథ్‌రెడ్డి, హనుమంతరెడ్డి, యువ నేత సాయిహర్ష, జిల్లా అధికార ప్రతినిధి ప్రియాంక, చామలూరు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించిన ప్రజలు
తలారి రంగయ్య ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ
మద్దతు తెలిపిన వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు


