స్వామి సేవ సరే.. సంభావన ఏదీ? | - | Sakshi
Sakshi News home page

స్వామి సేవ సరే.. సంభావన ఏదీ?

Nov 11 2026 12:43 AM | Updated on Nov 11 2026 12:43 AM

అనంతపురం కల్చరల్‌ : నిత్యం భగవంతుడి సన్నిధిలో తరిస్తూ.. ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ.. భక్తులకు ఆధ్యాత్మిక మార్గం చూపించే అర్చకుల జీవితాల్లో మాత్రం సంక్షేమ వెలుగులు కరువయ్యాయి. స్వామివారి సేవలో తరించే అర్చకులకు కనీస భరోసా అందని పరిస్థితి. ఓ వైపు సంక్షేమ పథకాలు వర్తించడంలేదు..మరోవైపు ఆలయ వ్యవహారాల్లో రాజకీయ నేతల జోక్యం మితిమీరింది. దీంతో అర్చకుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.

అనంతపురం జిల్లాలో ఎండోమెంట్‌ పరిధిలో దాదాపు 2,004 ఆలయాలు ఉన్నాయి. వాటిలో డీడీఎన్‌ఎస్‌, ధార్మిక పరిషత్‌ పథకం వర్తిస్తున్న ఆలయాల సంఖ్య తక్కువగా ఉంది. అనంతపురం జిల్లాలో డీడీఎన్‌ఎస్‌ కింద 452 ఆలయాలు ఉండగా, ధార్మిక పరిషత్తు కింద 175 మాత్రమే ఉన్నాయి. అలాగే, శ్రీసత్యసాయి జిల్లాలో డీడీఎన్‌ఎస్‌ వర్తిస్తున్న దేవస్థానాలు 292 కాగా, ధార్మిక పరిషత్తు కింద 47 ఆలయాలు ఉన్నాయి.

తారస్థాయికి చేరిన అవినీతి

దేవాదాయశాఖలో అవినీతి పరాకాష్టకు చేరింది. కొన్ని నెలల కిందట జిల్లా ఎండోమెంట్‌ సహాయ కమిషనర్‌గా పనిచేసిన మల్లికార్జున ప్రసాద్‌ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడడాన్ని చూస్తే.. అవినీతి ఏస్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుంది. అంతకు మునుపు ఏసీగా ఉన్న ఆదిశేషు నాయుడికి వ్యతిరేకంగా అప్పట్లో అర్చక సంఘాలు అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే.

డిమాండ్లు ఏళ్ల తరబడి బుట్టదాఖలే

కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ అందిస్తున్నామని చెపుతున్నా.. అర్చకులకు ఇంత వరకు ఒక్కరికీ రాలేదు. 13వ కాలంలో ఆలయాలను చేర్చాలని పట్టుబడుతున్నా అధికారులు మాత్రం ప్రభుత్వానికి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో డీడీఎన్‌ఎస్‌ (ధూప దీప నైవేద్య పథకం) గతంలో 421 వస్తుంటే ఈ మూడేళ్లలో కేవలం 60లోపు మాత్రమే కొత్తవి మంజూరు చేశారు.

డీడీఎన్‌ఎస్‌ –6సీలోని అన్ని ఆలయాలకు (15 ఎకరాలపై భూమి ఉన్న వాటికి కూడా ) వర్తింపచేయాలని అర్చకులు, అర్చక సమాఖ్య కోరుతోంది. అర్చకులకు ఇచ్చిన మాట ప్రకారం హెల్త్‌కార్డుల జారీ చేయలేదు. అర్చకులకు అధికారికంగా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

గ్రాట్యుటీ కోసం లంచం ఇచ్చుకోవాల్సిందే..

గూగూడు, నార్పల ఆంజనేయస్వామి ఆలయాల అర్చకులు మరణించినా.. వారికి రావాల్సిన డెత్‌ గ్రాట్యుటీ కోసం రూ.50 వేలకు పైగా లంచం ఇచ్చుకోవాల్సి వచ్చింది. డీడీఎన్‌ఎస్‌ (ధూపదీప నైవేద్య పథకం) వర్తింపజేయాలన్నా ఎండోమెంట్‌ శాఖలో చేతులు తడపాల్సి వస్తోందని అర్చక సంఘాల నాయకులు వాపోతున్నారు. ఇది కేవలం ఒకరిద్దరి అర్చకుల సమస్య మాత్రమే కాదు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చాలా అర్చక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా చలనమే లేదంటూ విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల వేళ నాయకులిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నిలదీస్తున్నారు. ముఖ్యంగా రైతు భరోసా గత ప్రభుత్వ హయాంలో మాదిరి ప్రస్తుతం ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. చాలా మంది ఈవోల వద్ద నుంచి ఫైళ్లు కదలడం లేదని అర్చక సంఘాలు వాపోతున్నాయి. ఆలయాలలో రాజకీయనాయకుల ఆధిపత్యం ఎక్కువైపోయిందనే దానిపై బహిరంగ చర్చ సాగుతోంది.

అర్చకులకు అందని సంక్షేమ పథకాలు

ఆలయాల్లోనూ మితిమీరిన రాజకీయ జోక్యం

ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేయని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement