అనంతపురం : కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాల ద్వారా ఫలితాలను తారుమారు చేసిందని, రీ–కౌంటింగ్‌ను పారదర్శకంగా నిర్వహిస్తే ప్రజా తీర్పు ఏమిటో బయటపడుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి అన్నారు. కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని భావిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలను నిరసిస్తూ మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య మంగళవారం కళ్యాణదుర్గంలో తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు అనంతపురం నుంచి బయల్దేరిన అనంత వెంకటరామిరెడ్డిని, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, మేయర్ రమేష్‌గౌడ్‌లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించలేకపోయిందని విమర్శించారు. ‘స్థానిక’ ఎన్నికల ఫలితాలపై సీఎంకు నమ్మకముంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఇటీవల జరిగిన అనంతపురం మేయర్ ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే 15వేల ఓట్ల మెజార్టీ వచ్చేదన్నారు.


