పంచాయతీ సమరానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ సమరానికి సిద్ధం

Nov 11 2026 12:43 AM | Updated on Nov 11 2026 12:43 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక సంస్థల్లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. పురపాలక, ప్రాదేశిక ఎన్నికల సందడి ముగియడంతో ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి పల్లెలపై పడింది. గ్రామ పంచాయతీల్లో పాగా వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గ్రామాల్లో పట్టున్న నాయకులను గుర్తించడం, బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం, స్థానికంగా ఉన్న అసంతృప్తులను చక్కదిద్దడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నాయి. పురపాలక, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రభావం పంచాయతీ ఎన్నికలపై ఎలా ఉంటుందనే లెక్కలు వేసుకుంటున్నాయి. గ్రామాల్లో వ్యక్తిగత పరిచయాలు, కుటుంబ సంబంధాలు, స్థానిక సమస్యలు, అభ్యర్థుల ప్రజాదరణ కీలకంగా మారనున్నాయి. దీంతో ప్రతి గ్రామంలోనూ రాజకీయ చర్చలు మొదలయ్యాయి.

రిజర్వేషన్లతో కొత్త లెక్కలు

పంచాయతీలు, వార్డులకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఆశావహుల లెక్కలు మారుతున్నాయి. జిల్లాలోని 576 పంచాయతీల్లో సర్పంచ్‌ పీఠాలను ఎస్టీలకు 18, ఎస్సీలకు 97, బీసీలకు 165, జనరల్‌కు 296 స్థానాలు కేటాయించారు. అలాగే 5,820 వార్డుల్లో ఎస్టీలకు 240, ఎస్సీలకు 990, బీసీలకు 1,662, జనరల్‌కు 2,928 వార్డులు కేటాయించారు. రిజర్వేషన్ల కారణంగా కొందరు ఆశావహులు పోటీకి దూరమవుతుండగా, కొత్తవారికి అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

మూడు విడతల్లో పల్లెపోరు

జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడత ఈ నెల 26న, రెండో విడత 29న, చివరి విడత డిసెంబర్‌ 2న పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. తొలి విడత నోటిఫికేషన్‌ ఈ నెల 13న, రెండో విడత నోటిఫికేషన్‌ 16న, మూడో విడత నోటిఫికేషన్‌ 19న విడుదల కానుంది.

● తొలి విడత..: అనంతపురం రూరల్‌, ఆత్మకూరు, రాప్తాడు, గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌, రాయదుర్గం, కుందుర్పి, శెట్టూరు, కంబదూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాల్లోని 218 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.

● రెండో విడత : గుంతకల్లు, గుత్తి, పామిడి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, బెళుగుప్ప, కూడేరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె మండలాల్లోని 193 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

● మూడో విడత : శింగనమల, నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లోని 165 పంచాయతీలకు పోలింగ్‌ జరగనుంది.

అప్పుడే మొదలైన రాజకీయ వేడి..

సర్పంచ్‌ పీఠాల కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు

బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న ఆశావహులు

మూడు విడతల్లో 576 పంచాయతీలు, 5,820 వార్డులకు ఎన్నికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement