కణేకల్లు: మెదడు వాపు జ్వరంతో బాధపడుతూ బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మాస్ట్ పెన్నంపలి మొహమ్మద్ బిలాల్‌కు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. వివరాలిలా ఉన్నాయి. కణేకల్లు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన 15 ఏళ్ల బిలాల్ కణేకల్లుక్రాస్‌లోని శ్రీ విద్యానికేతన్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. 20 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లాడు. తల్లిదండ్రులు బానుబ్బీ, వలీసాబ్ తమ కొడుకును చికిత్స నిమిత్తం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం కోసం రూ.25 లక్షలు అవసరమవుతాయని డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తమ కుమారుడికి ప్రాణం పోయాలని తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల వేదికగా కోరడంతో పలువురు దాతలు ముందుకొచ్చారు. ఇదిలావుండగా.. రాప్తాడులో ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపికను పరామర్శించేందుకు ఇటీవల వెళ్లిన మాజీ సీఎం జగన్... అక్కడే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బిలాల్‌ను కూడా పరామర్శించారు. తమ కుమారుడి వైద్యానికి డబ్బు అవసరముందని, సాయం చేయాలని తల్లిదండ్రులు కోరడంతో తప్పకుండా ఆర్థిక సాయం చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును మంగళవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథరెడ్డి..బిలాల్ తల్లిదండ్రులకు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి పాటిల్ చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.


