అనంతపురాన్ని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

అనంతపురాన్ని కాపాడుకుందాం

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు

అనంతపురం: దోపిడీదారులు, కబ్జాదారుల నుంచి అనంతపురం నగరాన్ని కాపాడుకుందామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి పిలుపునిచ్చారు. నగరం ప్రశాంతంగా ఉండాలంటే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు శుక్రవారం ఆర్ట్స్‌ కళాశాల హాస్టల్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు వైఎస్సార్‌సీపీ, సీపీఐ నాయకులు భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అనంత మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురంలో దౌర్జన్యాలు, కబ్జాలు, అవినీతి పెరిగిపోయాయని మండిపడ్డారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు.. ఉన్న పథకాలను కూడా నిలిపివేశారని విమర్శించారు. పోలింగ్‌ సమయంలో కార్యకర్తలు, ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, కూటమి నేతల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు తాము కాపలాదారులుగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కూటమి కుట్రలకు నిదర్శనం

నామినేషన్ల ప్రక్రియలో కూటమి నాయకులు చేసిన కుట్రల వల్లనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. 19 చోట్ల మళ్లీ నామినేషన్లకు ఆదేశించిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర నేత జగదీష్‌ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌తో పాటు 62 డివిజన్లలో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ, సీపీఐ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ప్రచారంలో అన్నీ అసత్యాలే

స్థానిక ఎన్నికల్లో కూటమి నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఢిల్లీ నాయకులతో షో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణను పూర్తి చేయలేని కూటమి ప్రభుత్వం, నగరాన్ని అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చేసిందని మండిపడ్డారు. ప్రజల ఆత్మగౌరవానికి.. ఢిల్లీ అహంకారానికి మధ్య పోరు జరుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ– సీపీఐని గెలిపించి అనంతపురం ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు అభివాదం చేస్తున్న అనంత వెంకటరామిరెడ్డి, రమేష్‌గౌడ్‌. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, నరేష్‌కుమార్‌రెడ్డి, సీపీఐ నేత జగదీష్‌

అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ, సీపీఐ శ్రేణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement