అనంతపురం అర్బన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్ వెల్లడించారు. అనంతపురం నగరంతో పాటు గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాల్లో 5 కిలో మీటర్ల పరిధి వరకు మద్యం దుకాణాలను శుక్రవారం సాయంత్రం 5 నుంచి నవంబరు 1వ తేదీ వరకు, అదే విధంగా 2వ తేదీన రీ–పోలింగ్ ఉంటే ఆ రోజు, 3వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం అమ్మకాలపై నిషేధాన్ని అమలు చేస్తున్నామన్నారు.
టీడీపీకి మద్దతివ్వలేదని
ఇంటిని కూల్చేశారు
కుందుర్పి: ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని టీడీపీ నాయకులు చక్రానాయక్, గోపాల్‌నాయక్, రాజూనాయక్ కక్షకట్టి తన ఇంటిని రెండు రోజుల క్రితం కూల్చేశారని ఎస్.మల్లాపురం తండాకు చెందిన సుజాతాబాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని చెప్పారు. అయితే పోలీసులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి సంఘటన స్థలానికి కూడా రాలేదని తెలిపారు. ఎమ్మెల్యే అమిలినేని ఆదేశాల మేరకే పోలీసులు స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు బుజ్జీనాయక్, కృష్ణానాయక్, నరశింహులు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.
మునిసిపల్ పోలింగ్‌కు 4,960 మంది సిబ్బంది
అనంతపురం అర్బన్: మునిసిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు 4,960 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్ అధికారుల 3వ ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీలో నిర్వహించారు. ఎన్నికలు జరగనున్న అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, తాడిపత్రి, కళ్యాణదుర్గం మునిసిపాలిటీల పరిధిలో 111 సున్నితమైన, అతి సున్నితమైన ప్రదేశాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, పరిశీలనకు 133 మంది సూక్ష్మ పరిశీలకులను కేటాయించారు.
పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ గడువు పొడిగింపు
అనంతపురం న్యూ టౌన్: ప్రాదేశిక ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలింగ్ సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఓటు హక్కు వినియోగం కోసం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ గడువును పొడిగించినట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, అదనపు జిల్లా ఎన్నికల అధికారి విజయలక్ష్మి తెలిపారు. గతంలో ఈ ఫెసిలిటేషన్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారుల (ఆర్‌ఓ) కార్యాలయాల్లో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరికీ తమ ఓటు హక్కును సౌకర్యవంతంగా వినియోగించుకునేలా మరింత సమయం కల్పించాలనే కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సదుపాయాన్ని నవంబర్ 3 వరకు పొడిగించినట్లు చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్లు 15,233
జిల్లాలోని 28 మండలాల పరిధిలో మొత్తం 15,233 పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అవసరమని జిల్లా అదనపు ఎన్నికల అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఇందులో మొత్తం పోలింగ్ సిబ్బంది 11,922 మంది, సర్వీస్ ఓటర్లు 1,111, హోం శాఖకు చెందిన మరో 2,200 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఆర్‌ఓలు, సహాయక పోలింగ్ అధికారులు 3,464 మంది, ఓపీఓలు 7,327 మంది, మైక్రో అబ్జర్వర్లు 450 మంది, ఫ్లయింగ్ రూట్ ఆఫీసర్లు 20,048 మంది రూట్ అధికారులు 170 మందితోపాటు తక్కిన ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు ఆమె తెలిపారు.
కలెక్టర్ ఆనంద్


