స్థానికేతరులు ఊరు దాటకుంటే చర్యలు | - | Sakshi
Sakshi News home page

స్థానికేతరులు ఊరు దాటకుంటే చర్యలు

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

● పట్టణాల్లో 144 సెక్షన్‌ అమలు : ఎస్పీ

అనంతపురం సెంట్రల్‌: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఆయా పట్టణాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ఎస్పీ జగదీష్‌ తెలిపారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికలు జరిగే పట్టణాల్లో స్థానికేతరులు ఉండకూడదన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తరఫున ప్రచారం, ఇతర ఎన్నికల కార్యకలాపాల కోసం వచ్చిన బయట వ్యక్తులు పట్టణాలు విడిచి వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. లాడ్జీలు, హోటళ్లు, వసతి ప్రాంతాలపై పోలీసుల నిఘా కఠినతరం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు.

పోలింగ్‌ కేంద్రాలు తనిఖీ

అనంతపురం నగరంలో కీలకమైన ఎన్నికల కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను శుక్రవారం ఎస్పీ పరిశీలించారు. ఎస్‌స్‌బీఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూం, ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం అత్యంత సమస్యాత్మక కేంద్రాలైన శ్రీకృష్ణదేవరాయ పాఠశాల (విద్యుత్‌నగర్‌), 49వ వార్డు సచివాలయం (నాయక్‌నగర్‌), మదర్‌ థెరిస్సా నగరపాలక పాఠశాల (రామ్‌నగర్‌), జనశక్తి ప్రభుత్వ పాఠశాల కేంద్రాలను తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అర్బన్‌ డీఎస్పీ కరుణాకర్‌రావు, సీఐలు పుల్లయ్య, మస్తాన్‌, ఆర్‌ఐ మధు, ఎస్‌ఐ గోపి తదితరులు పాల్గొన్నారు.

బందోబస్తుకు ‘అనంత కవచ్‌’

ఎన్నికల బందోబస్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ‘అనంత కవచ్‌’ పేరుతో ప్రత్యేక మొబైల్‌ యాప్‌ రూపొందించారు. ఈ మేరకు ఎస్పీ జగదీష్‌ శుక్రవారం తన చాంబర్‌ యాప్‌ను ఆవిష్కరించారు. సుమారు 1500 మంది పోలీసు సిబ్బందితో అన్ని పోలింగ్‌ కేంద్రాలనూ ఒకే డిజిటల్‌ వ్యవస్థతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నుంచి సమస్యలను వెంటనే తెలుసుకోవచ్చని తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే సమీపంలోని మొబైల్‌ పార్టీలను అలర్ట్‌ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

‘బైండోవర్‌’ ఉల్లంఘనులపై చర్యలు

జిల్లా వ్యాప్తంగా 52 మంది బైండోవర్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని, వారిపై చట్టప్రకారం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల్లో హింసకు పాల్పడితే రౌడీషీట్లు, పీడీ యాక్టు ప్రయోగిస్తామని, ఈ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement