కూటమిలో కుమ్ములాట | - | Sakshi
Sakshi News home page

కూటమిలో కుమ్ములాట

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

బొమ్మనహాళ్‌: రాయదుర్గం నియెజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. స్థానిక సంస్ధల ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు వ్యవహారం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో అసమ్మతికి ఆజ్యం పోస్తోంది. కూటమి ధర్మాన్ని పక్కనపెట్టి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారంటూ జనసేన, బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రెబల్‌ బాటలో ఆశావాహులు

కూటమి అధిష్టానం ఖరారు చేసిన సీట్ల సర్దుబాటు క్షేత్రస్ధాయిలో అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలున్నాయి. తమకు కేటాయిస్తామని హామీ ఇచ్చిన స్థానాలను ఇతరులకు కట్టబెట్టడంతో పలువురు నాయకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాయదుర్గం పట్టణంతో పాటు పలు మండలాల్లో టీడీపీ, జనసేనకు చెందిన అసంతృప్తి నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో కూటమిలో కలవరం మొదలైంది.

బొమ్మనహాళ్‌లో బహిర్గతమైన విభేదాలు

బొమ్మనహాళ్‌ మండల జెడ్పీటీసీ స్థానాన్ని కూటమి ఒప్పందంలో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా అలివేలు శ్రీనివాసులును ప్రకటించారు. అయితే టీడీపీ సీనియర్‌ నాయకుడు కొత్తపల్లి మహేంద్ర స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగడం వివాదానికి కారణమైంది. దీనిపై జనసేన అభ్యర్థి శ్రీనివాసులు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థికి మద్దతుగా నిలవాల్సిందిపోయి రెబల్‌ అభ్యర్థులను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు. గ్రామాల్లో టీడీపీ ఎంపీటీసీ సభ్యులు రెబల్‌ అభ్యర్థికే ప్రచారాలు చేస్తున్నారన్నారు. కూటమి ధర్మాన్ని పాటించకుండా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

జనసేన, బీజేపీలోనూ అసంతృప్తి

రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో జనసేన, బీజేపీ నాయకులు, కార్యర్తలు సీట్ల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వకుండా టీడీపీకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన స్ధానాల్లోనూ టీడీపీ నాయకులు పోటీకి దిగడం సరికాదంటున్నారు.

బుజ్జగింపులకు లొంగని రెబల్స్‌

రెబల్‌ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. పలువురు అభ్యర్థులు వెనక్కి తగ్గేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన తమకు అన్యాయం జరిగిందని వారు వాదిస్తున్నారు.

పొత్తు ధర్మం గాలికి !

కూడేరులోనూ..

కూడేరు: కూటమి ధర్మానికి టీడీపీ నేతలు తూట్లు పొడుస్తున్నారని బీజేపీ నేతలు మండి పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సీట్ల సర్దుబాటులో భాగంగా మండల పరిధిలోని తిమ్మాపురం ఎంపీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి బరిలో నిలిచారు. అయితే టీడీపీ నేతలు ముత్యాలు అనే వ్యక్తిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి ఆయన మద్దతు పలుకుతూ ప్రచారం చేస్తుండడంతో బీజేపీ మండల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి బీజేపీ అభ్యర్థికి సహకరించకుండా స్వతంత్ర అభ్యర్థికి మద్దతివ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ, జనసేన కండువాలు

వేసుకోని కూటమి చైర్‌ పర్సన్‌ అభ్యర్థి

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. అయితే అధికార కూటమిలో తీవ్ర అసంతృప్తి, వివాదం రగుల్చుకునే విస్తుపోయే ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. కూటమి పొత్తు ధర్మాన్ని కాలరాస్తూ, భాగస్వామ్య పక్ష పార్టీలైన బీజేపీ, జనసేనలను బహిరంగంగానే అవమానించేలా కూటమి చైర్‌ పర్సన్‌ అభ్యర్థి బుట్నా లక్ష్మి వ్యవహార శైలి కూటమి మిత్ర పక్ష పార్టీలో విస్మయానికి గురి చేస్తున్నాయి.

కళ్యాణదుర్గం మున్సిపల్‌ ఎన్నికల చివరి రోజులో భాగంగా ప్రచారంలో చైర్‌ పర్సన్‌ అభ్యర్థి బుట్నా లక్ష్మి తనపున ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మినారాయణలు కళ్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే కూటమి ఐక్యతను చాటేందుకు స్థానిక బీజేపీ, జనసేన నాయకులు వెనుక ఉన్నా అభ్యర్థి మాత్రం పొత్తు ధర్నాన్ని పాటించకుండా కనీసం బీజేపీ, జనసేన కండువాలను వేసుకోకుండానే చివరి రోజు ప్రచారం నిర్వహించడం గమనార్హం. ఎమ్మెల్యే అమిలినేని కూటమి కండువాలు వేసుకున్నా పక్కన ఉన్న ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి బుట్నా లక్ష్మి కేవలం టీడీపీ కండువాలను మాత్రమే వేసుకుని ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది.

అసంతృప్తిలో మిత్రపక్షాలు

ఓ వైపు రాష్ట్రస్థాయిలో కూటమి అగ్ర నేతలు ఐక్యత కోసం కష్టపడుతుంటే, స్థానిక అభ్యర్థులు మాత్రం కండువాలను కూడా వేసుకునేందుకు ఇష్టపడకపోవడంతో ఆయా పార్టీల్లో తీవ్ర దుమారం లేపుతోంది. టీడీపీ నేతలు కావాలనే దూరం పెడుతున్నారంటే బీజేపీ, జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.

‘దుర్గం’లో కాలవకు అసమ్మతి సెగ

ఎన్నికల బరిలో రెబల్స్‌ ఉండటంపై జనసేన, బీజేపీ శ్రేణుల అసంతృప్తి

పొత్తు ధర్మం కాలరాస్తున్నారని ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement