అ‘సత్య’ం.. అరాచకం | - | Sakshi
Sakshi News home page

అ‘సత్య’ం.. అరాచకం

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

అనంతపురం/ అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలో కీలకమైన అనంతపురం నగరపాలక సంస్థ మేయర్‌ టికెట్‌ కూటమి తరఫున బీజేపీకి కేటాయించారు. అయితే ఆ పార్టీకి ఇక్కడ ఓటు బ్యాంకు ఆ స్థాయిలో లేదు. మరోవైపు హామీల అమలులో చతికిలపడిన చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇంకోవైపు బలమైన ప్రత్యర్థిగా వైఎస్సార్‌సీపీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి సత్యకుమార్‌ రంగప్రవేశం చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సాగిస్తున్న అధర్మపాలన.. అరాచక పర్వాన్ని అనంతపురంలో ప్రవేశపెట్టి.. తద్వారా విజయం సాధించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ రాజకీయ పరిణామాలు నగర వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను, దుశ్చర్యలను ఆదిలోనే కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు.

ఉద్యోగులకు బెదిరింపులు

తమ పార్టీకి ఓటు వేయకపోతే ఉద్యోగాలు పోతాయని ఏకంగా మంత్రి సత్యకుమార్‌ బెదిరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఉద్యోగాలు ఊడగొడతామంటూ ఈ నెల 28న అనంతపురం సర్వజనాస్పత్రిలో నిర్వహించిన ఉద్యోగుల సమావేశంలో మంత్రి హుకుం జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటు విషయంలో భయభ్రాంతులకు గురిచేసి ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను ఉద్యోగ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఉద్యోగులు భావిస్తున్నారు. లేదంటే ధర్మవరం తరహా అరాచక పాలనను చవిచూడాల్సి వస్తుందని ముందుగానే అప్రమత్తమవుతున్నారు.

అరాచకవాదులకు గుణపాఠం

రాజకీయ నేతల అంచనాలకు మించి అనంతపురం నగర ఓటర్ల ఆలోచనా సరళి మారిందనే విషయం ఈ కొన్ని రోజుల ప్రచారంలో తేటతెల్లమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండున్నరేళ్లలో అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ సాగించిన అక్రమాల చిట్టాను నగర వాసులు మరవలేకపోతున్నారు. ఇదే విషయాన్ని సొంత పార్టీలోని నేతలు సైతం అంగీకరిస్తున్నారు. ఎమ్మెల్యే అరాచకాల మూలంగానే నగర పాలక సంస్థను తాము శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తోందనే ఆందోళన టీడీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంతర్మథనంలోనే ఇంత కాలం మల్లగుల్లాలు పడిన టీడీపీ నేతలు ఎలాగైనా బీజేపీ మేయర్‌ అభ్యర్థిని ఓడించి నగరాన్ని కాపాడుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీకి చెందిన ఓ అగ్రనేత సైతం ధ్రువీకరించడం గమనార్హం. దీనికి తోడు అనంతపురంలో స్థిరపడిన ఓటర్లలో అత్యధికులు విద్యావంతులు, మేధావులే ఉన్నారు. రెండున్నరేళ్లలో నగరంలో నెలకొన్న అశాంతియుత వాతావరణంపై వారు అసహనంతోనే ఉన్నారు. అవకాశం కోసం ఇంతకాలం వేచి ఉన్నారు. నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమి నేతలకు బుద్ధి వచ్చేలా తమ ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించేందుకు నగర వాసులు సిద్ధమయ్యారు.

పోలింగ్‌ బూత్‌ల కబ్జాకు పావులు

ధర్మవరం తరహాలో పాలన సాగిస్తారేమోనని భయం

ప్రశాంతంగా ఉండే అనంతలో చిచ్చు పెట్టేందుకు కుట్ర

ఓటు వేయకుంటే ఉద్యోగం పోతుందంటూ మంత్రి సత్యకుమార్‌ హుకుం

బీజేపీని ఓడించి.. గుణపాఠం నేర్పాలనే భావనలో నగర ప్రజలు

మేయర్‌ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో పొలింగ్‌ బూత్‌లను కబ్జా చేసేందుకు కూడా వెనుకాడని నైజంతో కూటమి నేతలు పావులు కదుపుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల పేరుపై తమ పార్టీకి చెందిన వారితో నామినేషన్లు వేయించడమే ఇందుకు నిదర్శనమని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాక పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ బయటి వ్యక్తులను ఇబ్బడి ముబ్బడిగా నగరానికి రప్పించుకుని తమదైన శైలిలో అరాచకం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలూ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement