కళ్యాణదుర్గం: మున్సిపల్ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యానికి పాతరేస్తోంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించకుండా తమకు నచ్చినట్టు నడుచుకుంటోంది. ఇవన్నీ కంటికి కనిపిస్తున్నా అధికార యంత్రాంగం మౌనం వహిస్తోంది. ఫలితంగా ఈ ఎన్నికల్లో అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన నుంచి నామినేషన్లు, ఉపసంహరణ ఘట్టం వరకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు డైరెక్షన్‌లో ‘పచ్చ’ మూకలు దాడులకు తెగబడ్డాయి. అయినా తట్టుకుని పోటీలో నిలబడిన వారిని ప్రచారం చేసుకోవడానికి ప్రజల వద్దకు వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసు వ్యవస్థను పావుగా వాడుకుంటున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నెగ్గలేమని తెలిసి.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను నయానో.. భయానో బెదిరించి.. టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కుట్రలు పన్నారు. అందులో భాగంగానే ‘మీరు ఏమి చేసుకుంటారో ఏమో తెలియదు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదం’టూ పోలీసులను ఉసిగొల్పుతున్నారు. టీడీపీ ముఖ్యనేతల ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. 32 వార్డులకు గాను 12 వార్డులకు సంబంధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల ఇళ్లకు అర్ధరాత్రి పూట వెళ్లి కుటుంబ సభ్యులను బైండోవర్ల పేరిట అదుపులోకి తీసుకుని భయాందోళనలు సృష్టిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తలారి లక్ష్మీప్రియ తండ్రి ఉమాపతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే దుశ్చర్యలపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
కళ్యాణదుర్గం ‘పుర’ పోరులో ఆధిపత్యం కోసం ఆరాటం
పోలింగ్ సమీపిస్తున్న వేళ బైండోవర్ పేరుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల కుటుంబ సభ్యులకు ఇబ్బందులు
టీడీపీ అభ్యర్థుల విజయం కోసం యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన


