టూటౌన్‌ పోలీసుల ఓవరాక్షన్‌ | - | Sakshi
Sakshi News home page

టూటౌన్‌ పోలీసుల ఓవరాక్షన్‌

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

అనంతపురం సెంట్రల్‌: అధికార పార్టీ నాయకుల డైరెక్షన్‌లో పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి ఇంటిపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న వేళ పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. నగరంలో 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న వర్దిరెడ్డి నాగార్జున రెడ్డి ఇంటిని గురువారం మధ్యాహ్నం టూటౌన్‌ సీఐ పుల్లయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటరు జాబితాను సరిచూసుకోవడం, ఓటర్లకు స్లిప్పులు అందజేయడం పరిపాటి. ప్రస్తుతం నగరంలో డివిజన్ల సంఖ్య కూడా పెరగడంతో ఓటర్లు ఏయే డివిజన్లకు మారిపోయారనే విషయంలో గందరగోళం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా పరిశీలిస్తుండగా.. అదేదో ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమన్నట్లుగా పోలీసులు ఆకస్మిక తనిఖీలతో హడావుడి చేశారు. విషయం తెలియగానే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌, పలువురు నాయకులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరును అనంత తీవ్రంగా ఖండించారు. ఓటర్లకు సమాచారం అందించడంలో తప్పేముందని పోలీసులను నిలదీశారు. టీడీపీ, బీజేపీ నాయకులు దొంగ ఓట్లు, డబుల్‌ ఓట్లతో నెగ్గాలని చూస్తున్నారని, మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మంత్రి సత్యకుమార్‌ ఒత్తిళ్లకు తలొగ్గి తమ పార్టీ వారిని ఇబ్బంది పెట్టడం తగదన్నారు. పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను బైండోవర్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏ ఎన్నికల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌ మాట్లాడుతూ తాను నగరపాలక సంస్థలో చలానా కట్టినా ఓటరు లిస్టు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని అధికారులను డిమాండ్‌ చేశారు. ముందు టీడీపీ, బీజేపీ ఆఫీసుల్లో ఏం జరుగుతోందో పరిశీలించి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి నాగార్జునరెడ్డి ఇంట్లో హడావుడి చేస్తున్న పోలీసులు మీడియాతో మాట్లాడుతున్న అనంత వెంకటరామిరెడ్డి

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి

నగరపాలక సంస్థ ఎన్నికల తీరుపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌ తదితరులు ఎస్పీ జగదీష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని కోరారు. మంత్రి సత్య కుమార్‌తో పాటు కూటమి పార్టీల నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మరోవైపు పోలీసులు కూడా తమ నాయకులు, కార్యకర్తలు, ఏజెంట్లకు ఫోన్‌ చేసి బైండోవర్‌ పేరుతో బెదిరిస్తున్నారని వివరించారు. రెండున్నరేళ్ల నిరంకుశ పాలనపై ప్రజలు ఆలోచించాలని, నిర్భయంగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇంటిపై ఆకస్మిక దాడి

భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు

ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement