అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రజల సమస్యలను టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఓట్లు రాబట్టుకునేందుకు ప్రజలపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోఎమ్మెల్యే మార్గదర్శకత్వంలో ఆయా టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థుల పర్యవేక్షణలో రాత్రికి రాత్రే తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న వార్డుల్లో బోర్ల తవ్వకాలు చేపట్టారు. సత్యసాయి తాగునీటి పథకం నీటి సరఫరా ఆగిపోయి ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లెక్కారు. తాగునీటి కోసం ఆక్రందనలు చేసినా ఎమ్మెల్యేకు కానీ, అధికారులకు గానీ వినపడలేదు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బోర్ల తవ్వకాలు మొదలు పెట్టారని వైఎస్సార్‌సీపీ, సీపీఐ నాయకులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజా సమస్యలు గుర్తు వచ్చాయా అంటూ ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై మండిపడ్డారు. అధికారుల తీరు, టీడీపీ నేతల ప్రలోభాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


