● మీడియాతో వెల్లడించిన మాజీ మంత్రి
యల్లనూరు: ‘నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశాను. అప్పట్లో నేను దౌర్జన్యాలు, అక్రమాలు, రౌడీయిజానికి పాల్పడి ఉంటే ఇప్పట్లో ఎవ్వరూ మిగిలేవారు కాదు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరూ ప్రశాంతంగా ఉండండి. సుపరిపాలనపై మాత్రమే దృష్టి సారించండి’ అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ టీడీపీ నేతలకు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన హయాంలో పుట్లూరు మండలాన్ని కక్షలు కార్పణ్యాలకు దూరంగా పెట్టానని, స్కూళ్లు, రోడ్ల అభివృద్ధికి పాటుపడ్డానని చెప్పారు. ఇప్పుడు శింగనమల నియోజకవర్గంలోని మండలాలపై చెడ్డవారి దృష్టి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమని ఘర్షణల్లోకి లాగాలని చూస్తున్నారన్నారు. ఇదంతా వదిలేసి ప్రశాంతంగా జీవించడానికి కృషి చేయాలన్నారు. టీడీపీ నేతలు బెదిరింపులు మానేసి ప్రజలకు సేవ చేయడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై పోటీపడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.
కూటమిలో కుమ్ములాట
● పొత్తు ముసుగులో కత్తులు దూస్తున్న ‘తమ్ముళ్లు’
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమిలో పొత్తు ధర్మాన్ని టీడీపీ విస్మరిస్తోంది. ‘జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకూడదు. వాళ్లకు ఎవరూ ఓటేయొద్దు. వాళ్లను ఓడించండి’ అని ఇటీవల మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపాయి. అలాంటి ఘటనే రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో వెలుగు చూసింది. పొత్తులో భాగంగా బొమ్మనహాళ్ జెడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. అలివేలు శ్రీనివాసులు బీఫాం అందుకుని కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఈ స్థానాన్ని ఆశిస్తూ వచ్చిన టీడీపీ నాయకుడు మహేంద్రకు భంగపాటు ఎదురైంది. అవకాశాన్ని వదులుకో కూడదని రెబల్‌గా మారిపోయాడు. స్వతంత్ర అభ్యర్థి (ఇండిపెంట్)గా బరిలోకి దిగి ప్రచారం మొదలు పెట్టాడు.
ఇండిపెండెంట్‌కే టీడీపీ ప్రచారం
బొమ్మనహాళ్ మండలంలో కూటమి పార్టీల తరఫున 16 మంది ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో నిలిచారు. కూటమి తరఫున జనసేన జెడ్పీటీసీ అభ్యర్థికి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ నాయకుడు మహేంద్ర గుర్తు బీరువాకు ఓటు వేసి గెలిపించండంటూ టీడీపీ అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. కొందరైతే టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇండిపెండెంట్‌కు ఓటేయాలని ప్రచారం చేస్తుండడం గమనార్హం.
మున్సిపల్ ఎన్నికల
పోలింగ్‌కు పటిష్ట భద్రత
అనంతపురం సెంట్రల్: నవంబర్ ఒకటో తేదీ జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులకు విధి నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలు, నిబంధనలపై పలు గురువారం జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. బందోబస్తు సిబ్బంది తప్పనిసరిగా యూనిఫాం, క్యాప్ ధరించి లాఠీతో విధులకు హాజరుకావాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే వ్యక్తులను క్షుణంగా తనిఖీ చేయాలన్నారు. అర్హత కలిగిన వారినే ఏజెంట్లుగా అనుమతించాలని, రౌడీషీటర్లు, ఇతరత్ర కేసులున్న వారు లేకుండా చూసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. డ్రోన్లు, సాంకేతిక పరిజ్ఞానంతో అవాంఛనీయ ఘటనలను ముందుగానే పసిగట్టాలన్నారు. సమష్టి కృషితో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పనిచేయాలని సూచించారు.
మున్సిపల్ ఎన్నికలకు 2,500 మంది సిబ్బంది
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు 2,500 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నట్లు వివరించారు.


