● ప్రింటింగ్ కేంద్రాలను సందర్శించిన రిటర్నింగ్ అధికారి
అనంతపురం న్యూటౌన్: జిల్లాలో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనంతపురంలోని వివిధ ప్రింటింగ్ కేంద్రాలలో బ్యాలెట్ పత్రాల ముద్రణ జరుగుతోంది. రిటర్నింగ్ అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ విజయలక్ష్మి గురువారం పలు బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తప్పులు లేకుండా బ్యాలెట్ పత్రాలు ముద్రించాలని ఆదేశించారు. నిర్దేశిత బ్యాలెట్ల పత్రాలలో సంబంధిత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అభ్యర్థుల వివరాలు, వారికి కేటాయించిన గుర్తులు, గుర్తింపు పొందిన పార్టీల వివరాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా చూడాలని జిల్లా పరిషత్ సిబ్బందిని ఆదేశించారు. క్రమ సంఖ్య, అభ్యర్థుల పేర్లు, గుర్తులు, బ్యాలెట్ పత్రాల రంగుల విషయంలో పొరపాట్లకు తావులేకుండా, నిర్ణీత గడువులోగా ప్రింటింగ్ పూర్తి చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్రణ పురోగతిని కూడా పరిశీలించారు. ప్రింటింగ్ ప్రక్రియ నాణ్యత, నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాల ప్రింటింగ్‌ను ఆర్ఓ క్షుణ్ణంగా సమీక్షించారు. రిటర్నింగ్ అధికారితోపాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, వెంకట నారాయణ, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సమత, అన్ని డివిజన్ల డీడీఓలు పాల్గొని ప్రింటింగ్ పనులను పర్యవేక్షించారు.
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోండి
‘ప్రాదేశిక’ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది, సర్వీస్ ఓటర్లు, ప్రత్యేక గుర్తింపు పొందిన వారు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్ఓ సూచించారు. ప్రతి మండలానికీ సగటున 150 బ్యాలెట్ పత్రాలను పంపినట్లు చెప్పారు. నేటి నుంచి నవంబరు ఒకటో తేదీ వరకు ఆర్ఓలకు నేరుగా అందజేయవచ్చని, కౌంటింగ్‌కు ముందు రోజు వరకు పోస్టు ద్వారా తమ ఓటు వేసిన బ్యాలెట్‌ను పంపుకోవచ్చునని వివరించారు.


