కళ్యాణదుర్గం: మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిగా బుట్నా లక్ష్మి అనే శ్రీలంక పౌరురాలిని తీసుకొచ్చి దేశ రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అనంత పురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొడగట్ట నారాయణ, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయదలచిన వారు భారతీయ పౌరులై ఉండాలన్న నిబంధనను కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీ ఉల్లంఘించిందని మండిపడ్డారు. అసలు పట్టణంలో అభ్యర్థే దొరకనట్టు.. ప్రజలకు అందుబాటులో లేని, విదేశీయురాలిని తీసుకురావడం సిగ్గుచేటని అన్నారు. విదేశీయులను చైర్పర్సన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. అందరికీ అందుబాటులో ఉండే వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి మౌనికకు ఓటు వేస్తారా.. లేక విదేశీయురాలికి పట్టం కడతారా అన్న విషయంలో కళ్యాణదుర్గం ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు జనార్దన్, మంజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


