ఒక రోజు ఓడీ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఒక రోజు ఓడీ ఇవ్వాలి

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఒక రోజు ప్రత్యేక ఆన్‌ డ్యూటీ (ఓడీ) సౌకర్యం కల్పించాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎస్‌టీయూ జిల్లా శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయాలని సూచించారన్నారు. ఉదయం ఓటు వేసి తిరిగి విధులు నిర్వహించే ప్రాంతానికి చేరుకోవడం కష్టమవుతుందన్నారు. ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌. రామాంజనేయులు, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు వి. రాజశేఖర్‌, జిల్లా ఆర్థిక కార్యదర్శి జి. మల్లికార్జున, రాష్ట్ర కౌన్సిలర్‌, రాష్ట్ర మున్సిపల్‌ ఉపాధ్యాయుల కమిటీ కన్వీనర్‌ బి. ఫణిభూషణ్‌, జిల్లా నాయకులు నిట్టూరు చంద్రశేఖరరావు, రామకృష్ణ, మల్లికార్జున, బాబ్జీ నాయక్‌, మహేశ్వర్‌రెడ్డి, గంగాధర్‌ పాల్గొన్నారు.

మందకొడిగా ‘రబీ’

● 15 వేల హెక్టార్ల వద్ద సాగుతున్న పరిస్థితి

అనంతపురం అగ్రికల్చర్‌: వర్షాలు లేక రబీ మందకొడిగా ‘సాగు’తోంది. రబీ అంచనా 1.08 లక్షల హెక్టార్లు కాగా కాస్త అటుఇటుగా 15 శాతంతో ప్రస్తుతానికి 15 వేల హెక్టార్లలో పంటలు వేశారు. ప్రధానపంట పప్పుశనగ 61 వేలు హెక్టార్లు అంచనా వేయగా 11 వేల హెక్టార్లలో విత్తుకున్నారు. మంచి వర్షం వస్తే నల్లరేగళ్లలో పప్పుశనగ సాగయ్యే అవకాశం ఉంది. ఇక 16 వేల హెక్టార్లకు గానూ 200 హెక్టార్లలో వేరుశనగ, 12,398 హెక్టార్లకు గానూ 600 హెక్టార్లలో మొక్కజొన్న, 5 వేల హెక్టార్లకు గానూ 1,500 హెక్టార్లలో జొన్న, 1,663 హెక్టార్లకు గానూ 1,370 హెక్టార్లలో ఉలవ సాగు చేశారు. 900 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 100 హెక్టార్లలో అలసంద, 50 హెక్టార్లలో కుసుమ, పెసర 50 హెక్టార్లలో వేశారు. విస్తారంగా వర్షాలు కురవాల్సిన అక్టోబర్‌లో 100.6 మి.మీ గానూ ఇప్పటి వరకు 31.3 మి.మీ నమోదు కావడంతో రబీ నిరాశాజనకంగా ‘సాగు’తోంది.

30న పింఛన్ల పంపిణీ

అనంతపురం టౌన్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్లను ఈనెల 30న జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలజా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్‌ 1న నగరపాలకతోపాటు పురపాలక సంఘాల ఎన్నికల జరుగుతుండడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 29న సచివాలయ ఉద్యోగులు పింఛన్‌ మొత్తాన్ని డ్రా చేసుకొని 30న ఉదయం నుంచి పంపిణీ చేస్తారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,74,708 మందికి రూ.123.52కోట్లు నిధులు మంజూరైనట్లు వివరించారు.

సరిహద్దులో పటిష్ట నిఘా

రాయదుర్గం: స్థానిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రాయదుర్గం మార్కెట్‌యార్డులో అనంతపురం ఎకై ్సజ్‌ డీసీ ప్రసాద్‌, ఈఎస్‌ రామమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్ణాటక అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. కణేకల్లు, కళ్యాణదుర్గం, కంబదూరు, ఉరవకొండ ఎకై ్సజ్‌ సీఐలతో పాటు కర్ణాటక సరిహద్దు జిల్లాలోని మొలకాల్మూరు, చెళ్లకెర, బళ్లారి, చిత్రదుర్గం, సండూరు ఎకై ్సజ్‌ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీ, ఈఎస్‌ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశామన్నారు. మద్యం, నాటుసారా, గంజాయి, నగదు, ఇతర వస్తువులు తరలిపోకుండా గట్టి భద్రత చర్యలు చేపట్టామన్నారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రాయదుర్గం చెక్‌పోస్టులోనే నగదు, వాహనాలను సీజ్‌ చేశామన్నారు. నేరస్తుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించి, కలసి దాడులు నిర్వహించేలా అంగీకరించామన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

తాడిపత్రి రూరల్‌: తాడిపత్రి–కోమలి రైల్వేస్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వరప్రసాద్‌ మంగళవారం తెలిపారు. 30 ఏళ్లలోపు వయస్సుగల మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి రైల్వే ట్రాక్‌కు 10 అడుగుల దూరంలో మృతి చెందాడన్నారు. కీ మ్యాన్‌ అరవింద్‌ సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామని, అయితే ఎలాంటి అధారాలు లభించలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement