దారి లేకున్నా.. దయతో కదిలారు! | - | Sakshi
Sakshi News home page

దారి లేకున్నా.. దయతో కదిలారు!

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

● రైలు ప్రమాద బాధితుడి కోసం 4 కిలోమీటర్ల బైక్‌పై ప్రయాణం

రాప్తాడు రూరల్‌: కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని కాపాడేందుకు 108 అంబులెన్స్‌ సిబ్బంది అసాధారణ సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. ప్రమాద స్థలానికి అంబులెన్స్‌ వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ద్విచక్ర వాహనంపై సుమారు 4 కిలోమీటర్ల దూరం బాధితుడిని తీసుకొచ్చారు. 108 పైలట్‌ మన్నల రాము, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు (ఈఎంటీ) రామాంజినేయులు చూపిన చొరవపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మంగళవారం మైసూరు ఎక్స్‌ప్రెస్‌లో మధురై నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో చిగిచెర్ల–జంగాలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు తలుపు వద్ద నిలబడి ఉండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అదే సమయంలో రైల్వే ట్రాక్‌ను పరిశీలిస్తున్న ట్రాక్‌మ్యాన్‌ గాయపడిన వ్యక్తిని గుర్తించి వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించాడు.

బైక్‌పై బాధితుడిని మోసుకొచ్చి

సమాచారం అందుకున్న వెంటనే 108 పైలట్‌ మన్నల రాము, ఈఎంటీ రామాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడికి అంబులెన్స్‌ వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించడం సవాలుగా మారింది. దీంతో సిబ్బంది వెనుకడుగు వేయకుండా ట్రాక్‌మ్యాన్‌ ద్విచక్ర వాహనంతో క్షతగాత్రుడిని సుమారు 4 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చారు. బాధితుడికి ప్రాథమిక చికిత్స అందిస్తూ అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి చేర్చేందుకు 108 సిబ్బంది ప్రదర్శించిన మానవత్వం, సాహసాన్ని స్థానికులు, అధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement