● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
రాప్తాడు రూరల్: పోలీసు పోలీసులపై తనకు గౌరవం ఉందని, అయితే తన పోరాటం టీడీపీకి తొత్తులుగా మారిన వారిపై మాత్రమేనని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసు అధికారుల సంఘం నిర్వహించిన విలేకరుల సమావేశంపై మంగళవారం వీడియో విడుదల చేశారు. తన భాష తప్పయి ఉండొచ్చని, అయితే తాను చెప్పిన భావం మాత్రం మారదని స్పష్టం చేశారు. ఇటీవల నామినేషన్ల సందర్భంగా కురుబ బండి రాముడిపై హత్యాయత్నం జరిగి, ఆయన కోమాలోకి వెళ్లారని తెలిపారు. కనగానపల్లి వద్ద తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి, వాహనాలను ధ్వంసం చేశారని, ఈ ఘటనలపై ఎల్లో మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
నామినేషన్లు అడ్డుకున్నది మీరు కాదా?
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల సమయంలో తమ అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను చించివేయడం వంటి ఘటనలు జరిగాయని, బాధ్యులపై చర్యలు తీసుకున్నారా అని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. చెన్నేకొత్తపల్లిలో ఇస్మాయిల్ అనే పోలీసు అధికారి సహకారం వల్లే తమ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారని, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎస్పీలు బందోబస్తు ఏర్పాటు చేసి సహకరించారని గుర్తుచేశారు.
పోలీసు వ్యవస్థపై వ్యతిరేకత లేదు
పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తేనే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారని ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. స్టీఫెన్ రవీంద్ర వంటి అధికారులు గతంలో ఫ్యాక్షన్‌ను అణచివేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. 2016లో కనగానపల్లి వద్ద టీడీపీ నేతల దాడి నుంచి తనను కాపాడిన త్రిలోక్ వంటి అధికారులను తాను అభినందిస్తానన్నారు. పోలీసులంటే తనకు గౌరవముందని, అయితే అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి నేరాలకు అండగా నిలిచే వారినే వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు.
మళ్లీ రక్తచరిత్ర రావొద్దనే హెచ్చరిక
1995లో పరిటాల రవి హయాంలో జరిగినట్లు తాను పేర్కొన్న దౌర్జన్యాలు, ఫ్యాక్షన్ పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే హెచ్చరించానని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. తాను ఉపయోగించిన పరుష పదజాలం పోలీసులను ఉద్దేశించి కాదని, టీడీపీకి చెందిన గూండాలు, రౌడీలు, నేరాలకు పాల్పడుతున్న వారిని ఉద్దేశించి మాట్లాడానని ప్రకాష్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ భాష ఉపయోగించడం కూడా తప్పేనని అంగీకరించారు. అయితే ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును హరిస్తున్న పరిస్థితులపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


