బెళుగుప్ప: యలగలవంక సమీపంలో పచ్చిగడ్డి కోసం తోటలోకి వెళ్లిన బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితుడి వివరాల మేరకు..కర్ణాటకలోని బళ్లారి జిల్లా సుండూరు తాలూకా ఆర్ గొల్లాహట్టి గ్రామానికి చెందిన వీరదొడ్డప్ప మరికొందరితో కలసి నాలుగు రోజుల క్రితం గొర్రెల మేపు కోసం యలగలవంక గ్రామానికి వచ్చారు. మంగళవారం ఉదయం వీరదొడ్డప్ప కుమారుడు విఠల్(13) మంగళవారం గొర్రె పిల్లల కోసం మంద సమీపంలోనే ఉన్న బొప్పాయి తోటలోకి పచ్చిగడ్డి కోసం వెళ్లాడు. పచ్చి గడ్డి కోస్తుండగా అక్కడే పిల్లలతో మాటువేసిన ఎలుగుబంటి ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసి ముఖ బాగాన్ని ఛిద్రం చేసింది. బాలుడి అరుపులను సమీపంలోని కాపరులు పసిగట్టి కేకలు వేస్తూ వెళ్లడంతో ఎలుగుబంటి బాలుడిని వదలి పారిపోయింది. దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని తొలుత కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో బళ్లారి విమ్స్‌కు తరలించారు. విమ్స్‌లో పరిశీలించిన వైద్యులు బెంగళూరు తీసుకెళ్లాలని సూచించినట్లు బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. రమనేపల్లి అటవీప్రాంతం సమీప గ్రామాల్లో వన్యమృగాలు వ్యవసాయ తోటల్లోకి వస్తూండటంతో రైతులు, వ్యవసాయకూలీలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఫారెస్ట్ బీట్ ఆపీసర్ పెద్దన్న బాధితుడి నుంచి వివరాలు సేకరించారు.


